17-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 16 (విజయ క్రాంతి): రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు, వారి సంక్షేమానికి విద్యుశాఖ అనేక చర్యలు తీసుకుంటున్నది. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రోజుల తరబడి వేచి చూసి అనంతరం రైతులే ట్రాన్స్ ఫార్మర్లను తమ స్వంత వాహనాల్లో తీసుకువెళ్లి రిపేర్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకు స్వస్తి పలికేందుకు విద్యుత్ శాఖ ముందడుగు వేసింది.
ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నది. వ్యవసాయ సర్వీసులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నది. కరీంనగర్ సర్కిల్ పరిధిలో 1094 సర్వీసులు మంజురు చేశారు. గతంలో కంటే 98 సర్వీసులు అంటే 10 శాతం పెరిగింది. వ్యవసాయ సర్వీసుల మంజూరుకు విద్యుతాశాఖ సత్వర చర్యలు తీసుకుంటున్నది.
రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ సర్వీసుల మంజూరుకు పెద్దపేట వేస్తున్నది. రైతులకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించే దిశగా విద్యుత్ శాఖ పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వంగిన పోల్స్, లూజ్ లైన్లను సరిచేస్తున్నారు. మధ్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు లూజ్ లైన్లు 1176, వంగిన పోల్స్ 529 సరిచేసి, మధ్య స్తంభాలు 1981 ఏర్పాటు చేశారు.
అలాగే రైతులు పంపుసెట్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాన్స్ఫార్యర్లపై లోడ్ భారం తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగులో ఎస్టిమేట్ వివరాలను అందజేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోయినప్పుడు తరలించేందుకు విద్యుతాశాఖ కొత్త వాహ నాలను ఏర్పాటు చేసింది.
సర్కిల్ పరిధిలో 12 కొత్త వాహనాలు ఏర్పాటు చేయగా, ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిందని తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లి కొత్త ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నారు. అలాగే చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మత్తుల కోసం కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ట్రాన్స్ఫాల్యర్ల మరమ్మత్తులో ఆలస్యం జరగకుండా చూస్తున్నారు. వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు ఫెల్యూర్ కాకుండా పిడుగుల నిరోధకాలను ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలంలో విద్యుత్ లోడ్ పెరుగుతున్న అంచనాల మేరకు 363 కొత్త ట్రాన్సఫార్యర్లను ఏర్పాటు చేసి లోడ్ సామర్ధ్యాన్ని పెంచారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలందించేందుకు కృషి:- ఎస్‌ఈ రమేశ్ బాబు
రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రా న్స్ఫార్మర్లు కాలిపోయిన సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తున్నాం. లూజ్ లైన్లు, వంగిన పోల్స్ ను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాం. అలాగే రైతుల సంక్షేమం అనేక రకాల చర్యలుతీసుకుంటున్నాం.