21-11-2025 12:35:36 AM
హుస్నాబాద్ ఎల్లమ్మగుడి భూ వివాదంపై దేవాదాయ శాఖ ఉప కమిషనర్ విచారణ
హుస్నాబాద్, నవంబర్ 20 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని చారిత్రక ఎల్లమ్మ దేవాలయం చుట్టూ అల్లుకున్న భూ వివాదంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆలయ భూములకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ స్థలాన్ని దేవాలయ సిబ్బంది ఆక్రమి స్తున్నారనే ఆరోపణలు, మంత్రి కొండా సురేఖ ఆదేశాల నేపథ్యంలో..
దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ కేఎన్ సంధ్యారాణి గురువారం ఆలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఉప కమిషనర్ తోపాటు సిద్ధిపేట జిల్లా ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ 265లో గల 4. 4 ఎకరాల స్థలంపై విచారణ నిర్వహించారు.
ఈ విచారణకు దారితీసిన ప్రధాన కారణం.. దేవాలయం ఈవో (కార్యనిర్వహణాధికారి) తో పాటు మరికొందరు కలిసి తమ సొంత భూమిని ఆక్రమిస్తున్నారంటూ సయ్యద్ రఫీ చేసిన తీవ్ర ఆరోపణలే. తాము దానం చేసిన ఆలయ భూమి పక్కనే ఉన్న తమకు చెందిన సర్వే నంబర్ 264లోని 32.5 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని రఫీ ఆరోపించారు.
దీనిపై సెప్టెంబర్ 2024లో అడ్వకేట్, కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే జరిగి, హద్దు రాళ్లు పెట్టినప్పటికీ, వాటిని తొలగించి పిల్లర్లు నిర్మించారని,. దీనిపై హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
మంత్రి కొండా సురేఖ ఆదేశంతో విచారణ
ఈ పరిణామాల నేపథ్యంలో, రఫీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, అక్కడ జరుగుతున్న నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, జాయింట్ సర్వే నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. దీంతో ఉప కమిషనర్ సంధ్యారాణి విచారణ చేపట్టారు. ఆలయ అధికారులు, ఆలయకమిటీ సభ్యులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల ఉన్న స్థానికులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.
విచారణానంతరం, ఉప కమిషనర్ దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా సమీక్షించారు. ఆమె వెంట దేవాలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావుతో పాటు గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, స్థానిక నాయకులు ఆకుల వెంకన్న, పూదరి లక్ష్మీనారాయణ, పున్న సది, చిత్తారి రవీందర్, రమణ తదితరులున్నారు.