calender_icon.png 21 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుకోసం పాకులాట!

21-11-2025 12:58:18 AM

తరచుగా ఐఏఎస్‌ల బదిలీలు

  1. రెండేండ్లలోనే నాలుగైదు చోట్లకు పలువురు అధికారుల స్థానచలనం 
  2. ఐఏఎస్ సీనియర్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్ వెనుక కారణమిదే!
  3. అధికారుల్లో పెరుగుతున్న అసంతృప్తి 
  4. త్వరలో మరో పాతికమంది ఐఏఎస్‌ల బదిలీ అంటూ చర్చ

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అంటే ఫరవాలేదు. సర్కారు పెద్దలకు కావాల్సిన టీములను సిద్ధం చేసుకోవడంలో భాగంగా ఆల్ ఇండియా సర్వీసులు అయిన ఐఏఎస్‌లు, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీచేయడం సహజమే. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తికావస్తున్నా ఇంకా బదిలీల పర్వం కొనసాగటమే వింత. దీనితో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఒకింత అసంతృప్తికి దారితీస్తోంది.

వెరసి.. పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా పట్టు చిక్కనట్టుగా రాజకీయ విశ్లేషకుల విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూపించేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి అధికారులే. ఇందులో అత్యంత ముఖ్యమైనవారు ఐఏఎస్‌లు అయితే.. శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ లాంటివాటిని చూసే ఐపీఎస్ అధికారులుకూడా సర్కారుకు కండ్లు, ముక్కు, చెవులుగా పనిచేస్తారనే పేరుంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనపై తమదైన ముద్ర వేయడానికి వీలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ వస్తున్నది. అయితే పరిపాలనపై ఇంకా ‘చేతి’కి పట్టు చిక్కకపోవడంతో.. తరచుగా బదిలీలు చేయ డం ఒక ప్రహసనంలా మారిందనే చర్చ తలెత్తింది.

కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబరు మొదటివారంలో తెలంగాణలో పరిపాలనా పగ్గాలు అందుకుంది. అదే నెలలో ఐఏఎస్ అధికారుల బదిలీలతో మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. గడిచిన 23 నెలల్లోనే అనేక దఫాలుగా ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదిలీలు చేయడం గమనార్హం. ఇందులోనూ పలువురు అధికారులకు ఈ రెండేండ్లలో కనీసం నాలుగు నుంచి ఐదు పోస్టింగులు ఇచ్చారు. అంటే సగటున ఐదు నెలలపాటే ఒక్కో పోస్టులో పనిచేసినట్టు భావించాలి. దీనివల్ల అటు అధికారికి సదరు శాఖపై పట్టుచిక్కకపోవడంతో.. ఇటు ప్రభుత్వ పెద్దలకుకూడా పరిపాలనలో గందరగోళం, అయోమయం తలెత్తుతోంది.

అధికారులకు పట్టులేదు..

ఇలా అనేకసార్లు ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానభ్రంశం కల్పించడంతో వారికి శాఖలపై పట్టు దొరకడం లేదు. ఇక పరిపాలనపై పట్టు బిగించాలని చూస్తున్న ప్రభుత్వానికి అది అందని ద్రాక్షలా కనపడుతోంది. స్థిరంగా అధికారులను ఒకచోట పనిచేయనిస్తే.. సత్ఫలితాలు ఉం టాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

నిజానికి పరిపాలనపై పట్టుకోసమే ప్రభుత్వం ఇన్నేసిసార్లు అధికారులను బదిలీ చేస్తుందని చెబుతుండగా.. కొద్దిమంది అధికారుల విషయంలో ఇది తరచుగా జరుగుతుండటం గమనార్హం. రెండేండ్లలో నాలుగైదు సార్లు బదిలీఅయిన అధికారులుకూడా ఉన్నా రు. అంటే సగటున నాలుగైదు నెలలపాటే ఆయా శాఖలను చూశారు. దీనితో అటు ఆయా శాఖలపై పట్టురాక.. ఆ శాఖలోని లోటుపాట్లు గ్రహించేలోగానే అక్కడినుంచి బదిలీ అవుతుండటంతో.. అధికారుల్లోనూ అసంతృప్తి వెల్లడవుతోంది.

పైగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తడి ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఏఎం రిజ్వీ వాలంటరీ రిటైర్మెం ట్ తీసుకుని వెళ్ళిపోయారనికూడా అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. సరిగా పనిచే యనీయకుండా, చేసుకోకుండా ఈ బదిలీల వ్యవహారం ఉందని ఆల్ ఇండియా సర్వీసు అధికారుల్లో అసంతృప్తి రోజురోజూకూ పెరుగుతోంది.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనపై పట్టు నిలుపుకోవాలంటే.. కనీసం ఒకట్రెండు సంవత్సరాలపాటైనా అధికారులకు బదిలీలు లేకుండా చూస్తే.. వారి పనితీరును మెరుగుపర్చడం ద్వారా.. ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం బదిలీలపై దృష్టి పెట్టకుండా.. వారి పనితీరుపై దృష్టి పెడుతుందని అందరూ ఆశిస్తున్నారు.. అన్నట్టు త్వరలోనే మరో 25 మందివరకు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నట్టు అధికారవర్గంలో చర్చ మొదలవ్వడం గమనార్హం.

తరచూ బదిలీలు..

గడిచిన 23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇప్పటివరకు సుమారు 10 సార్లు ఆల్ ఇండియా సర్వీసు అధికారుల బదిలీలను చేపట్టారు. అయితే ఇందులో.. పరిపాలనాపరంగా, ఆరోపణలు వచ్చినప్పుడు చేయడం ఒకటైతే.. తరచుగా బదిలీ చేయడమే ఇక్కడ సమస్యగా పరిణమిస్తోంది.

* 2023 డిసెంబరు 17 నాడు 10 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బది లీ చేసింది. దీనితో ఆల్ ఇండియా సర్వీ సు అధికారుల బదిలీల ప్రవాహం మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదట చేసిన బదిలీ ల్లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంక టేశం,ఎ.వాణీ ప్రసాద్, రాహుల్ బొజ్జా తదితర సీనియర్ అధికారులున్నారు.

* 2024 జనవరిలోనే సుమారు 26 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో రాహుల్‌బొజ్జాను నీటిపారుదల శాఖకు, శరత్‌ను గిరిజన సంక్షేమ శాఖకు, వల్లూరు క్రాంతిని సంగారెడ్డి కలెక్టర్‌గా, బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా ను మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ చేసింది.

* 2024 జూన్‌లో సుమారు 40 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బది లీ చేసింది. ఇందులో ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్‌కుమార్ సుల్తానియా, అప్పటివరకు ఇంధన శాఖ సెక్రెటరీగా ఉన్న ఎస్‌ఏ ఎం రిజ్వీని కమర్షియల్ టాక్స్ శాఖకు బదిలీ చేశారు. సంజయ్‌కుమార్, ఎ.వాణీప్రసాద్, శైలజా రామయ్యార్, అహ్మద్‌నదీం, రోనాల్డ్‌రోస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి ఎనర్జీ సెక్రెటరీగా చేశారు.

అలాగే సి.సుదర్శన్‌రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, అమ్రపాలి కాటా, జ్యోతిబుద్ధ ప్రకాష్, ఇలంబరితి, ఈవీ నర్సింహారెడ్డి, దాసరి హరిచందనతోపాటు ఐజీగా ఉన్న ఏవీ రంగనా థ్‌ను జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేశారు. కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వగా.. మరికొందరికి ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి తప్పించారు.

* అంతకు  సుమారు వారం రోజుల ముం దే.. 20 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

* 2024 నవంబర్‌లో మరోసారి సుమా రు 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో ముజమ్మిల్ ఖాన్, బదావత్ సంతోష్, ఆశిష్ సంగ్వాన్, రాహుల్ శర్మ తదితరులు ఉన్నారు.

* 2025 ఏప్రిల్‌లో సుమారు 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో స్మితా సభర్వాల్, జయేష్ రంజన్, దానకిషోర్, శశాంక్‌గోయల్, సంజయ్‌కుమార టీకే శ్రీదేవి, ఇలంబరితి, ఆర్వీ కర్ణన్‌లు ఉండగా.. శశాంక, ఎస్.హరీష్, సంగీత, వెంకట్రావు, కాత్యాయనీ దేవి, ఈవీ నర్సింహారెడ్డి తదితరులకు అదనపు బాధ్యతలు అప్పగించడమో.. ఉన్న ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి తొలగించడమో చేశారు.

* 2025 సెప్టెంబర్‌లో సుమారు 8 మం ది ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగించారు. ఇందులో ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను అక్కడి నుంచి తప్పించి స్పెషల్ సెక్రెటరీగా నియమించారు. ఆ స్థానంలో ఎం.హరితను కలెక్టర్‌గా నియమించారు. ఈసారి ప్రధాన బదిలీల్లో రఘునందన్‌రావు, సురేంద్రమోహన్, ఎస్‌ఏఎం రిజ్వీ, కె.హరిత తదితరులున్నారు.

* 2025 అక్టోబర్ చివరికి.. సబ్యసాచి ఘోష్, అనితారామచంద్రన్, ఇలంబరితి, ఈ.శ్రీధర్ తదితరులకు స్థానచ లనం కల్పించడంతోపాటు పలువురికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.