21-11-2025 12:35:29 AM
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, నవంబర్ 20: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం నస్పూర్ మండలం తాళ్లపల్లి సమీపంలో గల గోదావరి నది తీరం వద్ద సాండ్ రీచ్ ను నస్పూర్ మండల తహసిల్దార్ సంతోష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు రవాణా చేస్తుందని తెలిపారు.
నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ప్రభుత్వ అభివృద్ధి పనులకు రీచ్ ల ద్వారా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక రీచ్ కు రాకపోకల కొరకు అవసరమైన తాత్కాలిక దారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హాజీపూర్ మండలంలో...
హాజీపూర్: హాజీపూర్ మండలం ముల్క ల్ల సమీపంలోని ఇసుక రీచ్ ప్రాంతాన్ని హాజీపూర్ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని గుడిపేట, నంనూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, ఈ క్రమంలో రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు. వరి ధాన్యం విక్రయించేం దుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యం త్రాగునీరు, నీడ మౌలిక వసతులు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, తేమ యం త్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు తదితరులున్నారు.