07-09-2025 12:13:47 AM
హైదరాబాద్, సెప్టెంబర్ ౬ (విజయక్రాం తి): ఇంజినీరింగ్ ఫీజుల అంశం ఎట్టకేలకు చివరి దశకు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల హియరింగ్ (విచారణ) ప్రక్రియ ఈ నెల ౩తో ముగిసింది. ఫీజుల నిర్ధారణకు సంబంధించి రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్ కాలేజీ ల యాజమాన్యాలకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) విచారించింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ హియరింగ్‌ను చేపట్టింది.
రోజు కు పది నుంచి 20 కాలేజీలను పిలిచి గతం లో ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ నివేదికలపై వివరాలను అడిగి తెలుసుకుంది. అయితే గతంలోనే ఇంజినీరింగ్ ఫీజుల ఖరారు అంశంపై ఇవే కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ విచారించి ఫీజులను నిర్ధారించి, ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా సమర్పించింది.
కానీ నిర్ధారించిన ఫీజులు కొన్ని కాలేజీలకు అనుకూలంగా ఉన్నాయని, ఎలాంటి విద్యాప్రమాణాలు పాటించని కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచేశారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఫీజులను ఖరారు చేయాలని, అయితే ఈసారి ఖరారు చేసే ఫీజులు విద్యాప్రమాణాలకు అనుగుణంగా నిర్ధారించాలని ఆదేశిస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈక్రమంలోనే టీఏఎఫ్‌ఆర్‌సీ మరోసారి అన్ని కాలేజీలను పిలిపించి విచారణ చేపట్టింది.
తప్పుడు లెక్కలిస్తే చర్యలు..
రాష్ర్టంలో ఇంజినీరింగ్ సహా ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీల హియరింగ్‌ను టీఏఎఫ్‌ఆర్‌సీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేవలం గతంలో ఏవైతే ఆయా కాలేజీలు ఫీజులు ఎందుకు పెంచాలో వివరిస్తూ సమర్పించిన ఆడిట్ రిపోర్టుల ఆధారంగానే ఈసారి కూడా అధికారులు ఫీజులను నిర్ధారించినట్టుగా తెలిసింది. కాలేజీలు సమర్పించిన రిపోర్టులు సరైనవేనని యాజమాన్యాల నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు.
ఇచ్చిన నివేదికల్లో ఏమైనా తప్పుడు లెక్కలు, సమాచారం ఉంటే కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేలా అఫిడవిట్లను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికంటే ముందు మీమీ కాలేజీల్లో ఎలాంటి వసతులున్నాయి? న్యాక్ ఉందా?, పీహెచ్‌డీ చేసిన ఫ్యాకల్టీలు ఉన్నారా? ఎలాంటి రీసెర్చ్‌లు చేశారు? విద్యాప్రమాణాలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అకాడమిక్ ప్రమాణాలను పాటించే కాలేజీలను బట్టి ఫీజులను ఫైనల్ చేస్తున్నారు.
త్వరలో సర్కార్‌కు నివేదిక..
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల అంశం వారం పది రోజుల్లో తేలనుంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విదేశీ పర్యటనలో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత ఉన్నతస్థాయి ఫీజుల కమిటీ సమావేశం నిర్వహించి ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు ఓ అధికారి తెలిపారు. మొత్తంగా ఈనెలలోనే ఫీజుల అంశం తేలిపోనుంది. అయి తే ఫీజుల అంశం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉండటంతో ఫీజుల కమిటీ సమ ర్పించిన నివేదికను హైకోర్టు ముందుంచనున్నారు. అప్పుడే దీనిపై ఓ స్పష్టత రానుంది. కాలేజీలు కోరే ఫీజులు అమలవుతాయా? లేక పాత ఫీజులు కొన సాగుతాయా, కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు ఫీజులను ఖరారు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ నూతన నిబంధనల ప్రకారం ఫీజులు ఖరారు చేయాలంటే ఇప్పుడు నిర్ధారించిన ఫీజులు మళ్లీ మారే అవకాశముంది. మొత్తంగా ఫీజుల అంశంపై అటు కాలేజీలు, ఇటు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొల్పుతోంది.