calender_icon.png 8 September, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం

07-09-2025 10:25:38 PM

భీరాంగూడ గుట్ట గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, సభ్యుల ఆధ్వర్యంలో

రూ.4,60,000లకు లడ్డు కైవసం చేసుకున్న, కాటా సుధా శ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్ (విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపాలిటీ(Ameenpur Municipality) పరిధిలోని భీరాంగూడ గుట్ట వద్ద శనివారం వినాయక నవరాత్రి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించి, వివిధ హోమాలు, ఆరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి గణపతి శోభాయాత్రను జాతర వాతావరణంలో ప్రారంభించి, నిమజ్జనంతో విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా భక్తుల ఉత్సాహం ఉరకలెత్తింది. గణపతి శోభాయాత్రలో భక్తులు బాణాసంచా పేల్చుతూ, డప్పులు, డీజేలు, నృత్యాలతో పాల్గొని వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు ఉత్సవంలో చురుకుగా పాల్గొన్నారు. శశిదర్ రెడ్డి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల చివరి రోజు నిర్వహించిన లడ్డు వేలం పాటలో భక్తుల పోటీ బిడ్లతో ఉత్సాహం నెలకొంది. చివరికి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ రూ.4,60,000లకు గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు. వేలం పాటలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వివిధ సంఘాలు కూడా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో భాగస్వాములై విజయవంతం చేశారు.