02-09-2025 12:00:00 AM
పారిశుద్ధ్య పనులు చేపట్టిన యువకులను అభినందించిన, మున్సిపల్ కమిషనర్
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 01, (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు ఎస్సీ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు వీధులన్నీ అస్తవ్యస్తంగా మారడంతో సోమవారం కాలనీకి చెందిన సుమారు 30 మంది యువకులు సొంతంగా వీధుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వీధి రోడ్ల వెంబడి దట్టంగా పెరిగిన గడ్డి, పొదలను యువకులంతా కలిసికట్టుగా పనిచేస్తూ తొలగించారు.
మున్సిపల్ కమిషనర్ మహేష్ యువకులతో పాటు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒక మార్పు అభివృద్ధికి మలుపు అని పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
కాలనీకి చెందిన యువకులందరూ కలిసికట్టుగా పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అనంతరం కొంతమంది యువకులను మున్సిపల్ కమిషనర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీకి చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు.