పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
బోధన్, జున్ 5 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని కోర్టు ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐదవ అదనపు జిల్లా జడ్జి వరూధిని, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ... అభివృద్ధి పేరుతో మనం పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నామని, దాని ఫలితంగా స్వచ్ఛమైన గాలి, సహజ వాతావరణం తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి పౌరుడు తన బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్ల పెంపకం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందుతుందని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండిఅనే సందేశాన్ని ప్రజలకు అందించారు.






