calender_icon.png 4 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఓటర్ జాబిత, వార్డుల విభజనలో లోపాలు

03-01-2026 06:41:25 PM

సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా , వార్డుల విభజనలో జరిగిన తప్పులతడకలపై సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించిన ఓటర్ల జాబితాను పరిశీలించగా అనేక తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా వార్డుల విభజన ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించి వార్డులకు కేటాయించినట్లు కనిపిస్తోందన్నారు. 

దీంతో ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరొక వార్డులో చేర్చబడటం, ఒక ఇంటి నంబరు ఒక వార్డులో చూపించబడినప్పటికీ వాస్తవంగా ఆ ఇల్లు మరో వార్డు పరిధిలో ఉండటం వంటి అనేక అసమానతలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇవి ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా, స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే ప్రమాదం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అధికారిక వార్డు మ్యాపులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం గమనార్హమన్నారు.

వార్డు సరిహద్దులను స్పష్టంగా చూపించే మ్యాపులను రూపొందించి, వాటిని ఓటర్ జాబితాతో పాటు ప్రజలకు ప్రదర్శించకపోవడం వల్ల వార్డు విభజన సరైనదేనా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు విభజనను ఇంటి నంబర్లు, భౌగోళిక సరిహద్దులు, అధికారిక రికార్డుల ఆధారంగా సమగ్రంగా పునఃపరిశీలించి, లోపాలు సవరించిన అనంతరం సరైన వార్డు మ్యాపులతో కూడిన ఓటర్ జాబితాను మళ్లీ ప్రకటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగేలా, ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు.