04-01-2026 02:48:41 PM
న్యూఢిల్లీ: వెనిజులాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs of India) పేర్కొంది. అమెరికా ప్రత్యేక దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను రాజధాని కారకాస్ లో బంధించిన ఒక రోజు తర్వాత భారత్ స్పందించింది. ''మేము మారుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంబంధిత పక్షాలందరూ చర్చల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ సమాజ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Ministry of External Affairs spokesperson Randhir Jaiswal) వెల్లడించారు.
నెలల తరబడి బెదిరింపులు, ఒత్తిడి వ్యూహాల తర్వాత, అమెరికా శనివారం వెనిజులాపై బాంబు దాడి చేసి వామపక్ష నాయకుడు మదురోను పడగొట్టింది. అతన్ని న్యూయార్క్‌లో విచారణకు తీసుకెళ్లారు. ఈ అమెరికా ఆపరేషన్ తో మదురో తలపై 50 మిలియన్ల అమెరికన్ డాలర్ల బహుమతి ఉన్న 12 సంవత్సరాల పాలనకు తెర పడింది. కరేబియన్‌లోని అమెరికా నావికాదళ నౌకలో వెనిజులా నాయకుడి చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి ఉన్న చిత్రాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అక్కడి నుండి ఆయనను, భార్య సిలియా ఫ్లోర్స్‌ను డ్రగ్స్, ఆయుధ ఆరోపణలను ఎదుర్కొనేందుకు న్యూయార్క్‌కు తరలించారు. "నేను టెలివిజన్ షో చూస్తున్నట్లుగా" మదురోను తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ప్రత్యక్షంగా పట్టుకునే ఆపరేషన్‌ను అనుసరించానని ట్రంప్ చెప్పారు.