15 April, 2026 | 10:40 AM

శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి

17-12-2025 01:11 AM
  1.   100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం 
  2. కార్మికులకు మరింత చేరువలో వైద్య సేవలు
  3. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): శంషాబాద్‌లో ఈఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్-లోని రాయికుంట గ్రామంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

రూ. 16.125 కోట్ల విలువ చేసే భూసేకరణకు కేంద్రం ఆమో దం తెలిపిందన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 1.32 లక్షలకు పైగా ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ కలిగిన కార్మికులు ఉన్నారని, వారికి అతి చేరువలోనే వైద్య సేవలు లభించనున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయలకు ఈమేరకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

2036 ఒలింపిక్స్ భారత్‌లో నిర్వహించేందుకు పీఎం కృషి 

2036లో ఒలింపిక్స్ క్రీడలు భారత్‌లో జరిగేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా సంప్రదాయ క్రీడలకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అందుకే 792 జిల్లా ల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు వచ్చేందుకు వారికి 8 ఏళ్ల పాటు అథ్లెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.