calender_icon.png 7 October, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతర నాటికైనా..

07-10-2025 12:00:00 AM

జాతీయ రహదారి పనులు పూర్తయ్యేనా?

అసంపూర్తి పనులతో అవస్థలు

 మహబూబాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ చత్తీస్ ఘడ్ రాష్ట్రాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన 163 జాతీయ రహదారిపై వరంగల్, ములుగు జిల్లాల పరిధిలో రెండు ప్రధాన వంతెనల నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడం వల్ల నిత్యం వేల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనుండగా, ఈసారి జాతర వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తారా లేదా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం 317 కోట్ల రూపాయలతో గతంలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డును నాలుగు వర్షాలుగా విస్తరించేందుకు 163 జాతీయ రహదారి పేరుతో హైదరాబాదు నుండి భూపాలపట్నం వరకు పనులు చేపట్టారు. హైదరాబాదు నుండి ఆత్మకూరు వరకు రహదారి నిర్మాణం పూర్తి చేశారు. హైదరాబాదు నుండి నేరుగా హనుమకొండ నగరానికి రాకుండానే బైపాస్ రోడ్డు ద్వారా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని భూపాలపట్నం వెళ్లడానికి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఇక తాడ్వాయి, ఏటుర్ నాగారం, గోవిందరావుపేట మండలాల పరిధిలో కొన్నిచోట్ల అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో రోడ్డు పనులు విస్తరించక పోగా, పలుచోట్ల వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువపై ఇరుకైన వంతెన విస్తరణ పనులు ఇటీవలే ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా కటాక్షపూర్ వద్ద చెరువు మత్తడి వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణం నత్తనడకన  సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కటాక్ష పూర్ వద్ద వంతెన నిర్మాణం పూర్తిచేసేంతవరకు ప్రస్తుతం ఉన్న లో లెవెల్ కాజ్ వే కు పటిష్టమైన మరమ్మత్తులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. లో లెవెల్ కాజ్ వే పైన గుంతలు ఏర్పడి వర్షం నీటిలో ప్రమాదాల చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు మాత్రమే రోడ్డు కాస్త మెరుగ్గా ఉండగా మరోవైపు పూర్తిగా దెబ్బతిందని, వరద ఉధృతిలో రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

దీనికి తోడు భారీ వర్షాలు కురిస్తే ఆ సమయంలో చెరువు మత్తడి పోయడం వల్ల వరద ఉధృతి పెరిగి పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఫలితంగా పరకాల మీదుగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మత్తడి పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువపై చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఇరుకు వంతెన కృంగిపోవడంతో రాకపోకలు నిలిపివేసి కొద్ది రోజులు పరకాల మీదుగా దారి మళ్ళించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టిన జాతీయ రహదారుల శాఖ తాత్కాలికంగా రాకపోకలను ఇటీవల పునరుద్ధరించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి దగ్గరి మార్గం కావడంతో పాటు నల్గొండ, వరంగల్, ములుగు, జిల్లాలకు ప్రధాన రహదారిగా ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తాయి. అలాగే తెలంగాణలో పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బోగత, లక్నవరంతో పాటు ప్రతిష్టాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతం వెళ్లడానికి ఈ మార్గమే ప్రధాన దిక్కుగా మారింది. అయితే కొన్ని ఏళ్ల క్రితం పనులు చేపట్టిన జాతీయ రహదారుల శాఖ  ఇరుకుగా మారిన వంతెనల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల తరచుగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని, వచ్చే ఏడాది మేడారం జాతరకు వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి 150 కోట్ల రూపాయలను మంజూరు చేసి మేడారంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి వందరోజులకు అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను ములుగు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే మేడారం రావడానికి ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు, వాహనదారులు పేర్కొంటున్నారు.

అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని, మేడారం వరకు నాలుగు వరసల రహదారి పనులను పూర్తిచేసి  జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై జాతీయ రహదారుల విభాగం ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ జాతర వరకు అసంపూర్తి పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఈ విషయంపై గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, పనులను వేగవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.