18-10-2025 12:52:41 AM
కోహ్లీ, రోహిత్‌లపై అగార్కర్
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నాడు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లనడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రస్తుత ఆసీస్ టూర్‌లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే వరుస సెంచరీలు చేసినంత మాత్రాన జట్టులో చోటుకు గ్యారెంటీ ఇవ్వలేమంటూ అగార్కర్ చెప్పడం సంచలనంగా మారింది.
పరుగులు కాదు తమకు ట్రోఫీలు ముఖ్యమంటూ అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసినా కూడా జట్టులో ఉంటారన్నది చెప్పలేమన్నాడు. ఎందుకంటే యువ ఆటగాళ్లు చాలా మంది పోటీలో ఉన్నారని, తమ ప్రణాళికలు తమకున్నాయని చెప్పుకొచ్చా డు. యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తే వారిద్దరి స్థానాలను భర్తీ చేసే అవకాశముం ది కదా అంటూ చెప్పాడు. ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నందున అప్ప టి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని తేల్చేశాడు.
సీనియర్ ప్లేయర్స్‌కు తాము ఎంతో గౌరవం ఇస్తామని, వారితో మాట్లాడిన విషయాలు బయటకు రావు కాబట్టి అందరూ ఏదేదో ఊహించుకుంటూ ఉంటారని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టూర్ కోసం జట్టు ఎంపిక సమయంలో అగార్కర్ ఇదే తరహా కామెంట్స్ చేశాడు. కాగా ఇప్పటికే టెస్టులకు, టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా టూర్‌లో రాణించడంపైనే వీరిద్దరి వన్డే కెరీర్ ఫ్యూచర్ ఆధారపడి ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అగార్కర్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
ఇదిలా ఉంటే కోహ్లీ,రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్‌పైనా అగార్కర్ స్పందించాడు. నిజానికి ఇంగ్లాండ్ టూర్‌లో వారిద్దరినీ ఆడించాలనుకున్నామని, కానీ వాళ్లే వీడ్కోలు పలికారని చెప్పాడు. రిటైర్మెం ట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని, ఎవ్వరూ ఒత్తిడి చేయరని స్పష్టం చేశాడు. గంభీర్ ఒత్తిడితోనే రోహిత్,కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చా యి. అయితే రిటైర్మెంట్ అనేది ప్రతీ ఆటగాడి కెరీర్‌లో చాలా సహజమైన విషయం గా అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఇక సీనియర్ పేసర్ షమీ ఫిట్‌గా లేకపోవడంతోనే ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదన్నాడు.