18-10-2025 08:47:10 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల బంద్(Telangana BC bandh) కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీసీ బంద్ కు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి శుక్రవారం నాడు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సు డిపోల ఎదుట రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బీసీ బంద్ లో నేతలు పాల్గొని నిరసన తెలుపుతున్నారు. జేబీఎస్ దగ్గర బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) బంద్ లో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నేతల ఆందోళన చేస్తున్నారు. దీంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. హనుమకొండలో మధుసూదనా చారి బంద్ లో పాల్గొన్నారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బంద్ లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దగ్గర బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణలో ధర్నాకు సై, ఢిల్లీలో నై అంటున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నా చేస్తే బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ లకు చట్టసభలలో విద్యా, ఉద్యోగాలలో 42శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.