calender_icon.png 18 October, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దకొత్తపల్లిలో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా..!

18-10-2025 08:16:25 AM

వారికి అండగా మండలాధికారులు. 

అర్ధరాత్రిళ్ళు గుట్టలను తవ్వి వెంచర్లకు మట్టి తరలింపు. 

పట్టించుకోని ఉన్నతాధికారులు.

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల(Peddakothapally Mandal) పరిసరాల్లోని గుట్టలు, ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన గైరాన్ భూములను అధికార పార్టీ ముఖ్య నేతలు అడ్డగోలుగా తవ్వుకొని అమాంతం మింగేస్తున్నారు. భారీ వృక్షాలు గట్లతో కూడిన గుట్టను తవ్వి పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రకృతి సంపదను దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక రైతులనుండి ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. వీటిపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత రెవిన్యూ, పోలీస్ మండల స్థాయి అధికారులు వారిని పట్టించుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 

గత నెల 8న గుట్టలను మింగుతున్న ఘనులు అనే శీర్షికన విజయక్రాంతిలో ప్రచురితమైన వార్త కథనంపై ఉన్నతాధికారులకు సైతం తప్పుడు నివేదికలు పంపినట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీకి చెందిన బడా లీడర్లు మరింత రెచ్చిపోయి అడ్డగోలుగా మట్టి దందాకు తెరలేపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఫలితంగా జాతీయ పక్షులు నెమళ్ళు, జీవరాసులు రైతుల పంట పొలాలు, గ్రామాలు, రోడ్లపైకి వస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు. భారీ గుట్టలను సైతం రాత్రి పగలు తేడా లేకుండా భారీ హిటాచీలు, జెసిబిల సాయంతో తవ్వి టిప్పర్లు, సమీప రైతుల పంట పొలాల మీదుగా తరలిస్తూ పంటలను కూడా నష్ట పరుస్తున్నారని వాపోతున్నారు. 

పెద్దకొత్తపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 460 లో బండి కాశన్న, బండి ఎల్లమ్మ రైతులకు చెందిన సుమారు మూడు ఎకరాల పంట పొలంలో బారీగా గోతులు తీసి ఎర్రమట్టిని తరలించినట్లు రైతులు వాపోయారు. సాగుకు పనికి రాకుండా అడ్డగోలుగా తవ్వినట్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. గత రెండు నెలలగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అటవీ శాఖలతోపాటు పోలీసు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సామాన్య రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికార బలం పరపతి ఉపయోగించి అధికార పార్టీలోని మంత్రి జూపల్లి అనుచరులే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆయా పంట పొలాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఓట్లు వేస్తే గెలిచిన సింగిల్ విండో డైరెక్టర్లే రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తూ అడ్డగోలుగా ఎర్రమట్టిని తవ్వుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు తాసిల్దార్ శ్రీనివాసులను వివరణ కోరగా ఫోన్ లైన్ లో అందుబాటులోకి రాలేదు.