calender_icon.png 7 July, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమ్ కార్డు ఉన్నా.. నెట్‌వర్క్ లేనట్టే..

07-07-2025 01:35:34 AM

-గ్లోబల్ సౌత్ దేశాలకు సరైన స్థానం దక్కడం లేదు

-భద్రతా మండలిలో వెంటనే సంస్కరణలు చేపట్టాలి

-బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

-మోదీకి మద్దతు పలికిన బ్రెజిల్ అధ్యక్షుడు

రియోడీజనీరో, జూలై 6: గ్లోబల్ సౌత్ దేశాలు లేకుంటే ప్రపంచంలోని సంస్థలు సిమ్‌కార్డు ఉన్నా.. నెట్‌వర్క్ లేని ఫోన్లలా తయారవుతాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఆదివారం రియోడీజనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

‘గ్లోబల్ సౌత్ దేశాలకు సరైన స్థానం దక్కడం లేదు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత ఇలా ప్రతి విష యంలోనూ గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులవుతున్నాయి. అనేక అంశాలపై గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ సంస్థల నుంచి సహకారం ఉండటం లేదు. నేడు బహుళ ధ్రువ, సమ్మిళిత ప్రపంచం ఆవిష్కృతం కావాల్సిన అవసరం ఉంది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి ప్రపంచస్థాయి సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ప్రారంభం కావా లి. బ్రిక్స్‌ను విస్తరిస్తూ.. కొత్త దేశాలను భాగస్వాములను చేస్తున్నాం. 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో 21వ శతాబ్దపు సాఫ్ట్‌వేర్ నడవదు. ప్రపంచస్థాయి సంస్థల్లో ఎప్పటి కప్పుడు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సంస్థల పనితీరు.. 21వ శతాబ్దపు సవాళ్లు ఎదుర్కోవడానికి ఏ మాత్రం సరిపోదు. కాలం చెల్లిన పద్ధతులతో ప్రపంచాన్ని నడిపించలేం.

భారత్ ఎప్పుడూ తన సొంత ప్రయోజనాలకంటే మానవాళి ప్రయోజనాల కోసమే పని చేయడం బాధ్యతగా భావిస్తుంది.’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని మోదీ వ్యాఖ్యలకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా మద్దతు పలికారు.

భారత్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత దేశాల జాబితాలో చేరాలని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలుండగా.. 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ 17వ బ్రిక్స్ సమావేశానికి హాజరవలేదు.  వీరిద్దరు మినహా బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.