30-11-2024 09:18:31 PM
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం (విజయక్రాంతి): ప్రతి పోలీసు సమాజం పట్ల బాధ్యతతో పని చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. జిల్లాకు ఎంపికై తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 159 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లతో శనివారం ఆయన పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలు కఠోర శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్నందుకు అభినంధనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నేరాల నియంత్రణలో అనేక సవాళ్లు ఉన్నాయని, గతంలో కంటే ఇప్పుడు పోలిసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఎల్లప్పడూ క్రమశిక్షణతో ఉండాలన్నారు. ధైర్యంగా నీతి, నిజాయితీతో వ్యవహరించాలన్నారు. అప్పగించిన బాధ్యతలను ఎలాంటి ఆరోపణలు లేకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజా సంబంధాలు మెరుగపర్చుకోవాలన్నారు. నిబద్ధతో పని చేసి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిసి అడ్మీన్ నరేశ్‌కుమార్, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు, ఏసీపీ సాంబరాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.