మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా సీస్ వంటి అంటూ వ్యాధులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వ్యాధుల నివారణ కమిటీతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని అంటు వ్యాధులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, ఫైలేరియాసిస్ వంటి దోమల ద్వారా సంక్రమించే వాహక వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పాత టైర్లు, పగిలిన కుండీలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా తొలగించాలని అన్నారు.ఓవర్హెడ్ ట్యాంకులు, సంప్లకు బిగుతైన మూతలు అమర్చాలని సూచించారు. దోమతెరలు, కిటికీలకు మెష్లు ఉపయోగించాలని అన్నారు, అవసరమైన చోట గాంబూసియా చేపలను నీటి వనరుల్లో వదిలి దోమల లార్వా నియంత్రణ చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రతి శుక్రవారం ’డ్రై డే’ పాటించి ఇంట్లోని నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రపరచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్ వి గిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ రమణ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






