ఆగస్టు 18న హైదరాబాద్‌లో రాందాస్ అథవాలే భారీ బహిరంగ సభ
- ఖైరతాబాద్‌లోని కొండా విశ్వేశ్వర భవన్‌లో నిర్వహణకు ఏర్పాట్లు
- తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి
ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆగస్టు18న హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్లోని కొండా విశ్వేశ్వర భవన్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సభలో దిశానిర్దేశం చేయనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి మేడి సతీష్ కుమార్ లు సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరుకానున్నారని వెల్లడించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, సామాజిక న్యాయం అంశాలపై రాందాస్ అథవాలే కీలక సందేశం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్పీఐ(ఏ) బలోపేతమే లక్ష్యం అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) జాతీయ అధ్యక్షుడు రాందాస్ అతవాలే నివాసంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మేడి సతీష్ కుమార్కు రాందాస్ అథవాలే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేస్తూ సంస్థాగతంగా విస్తరించాలని ఆయన సూచించారు.
తెలంగాణలో పార్టీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన అథవాలే, రాబోయే ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) విజయానికి ఆర్పీఐ(ఏ) కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని నాయకులకు రాందాస్ అథవాలే దిశానిర్దేశం చేశారు.






