రహదారి భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి
అడిషనల్ డీజీపీ సంజయ్ జైన్
గాంధారి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా స్థానిక హరాలే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా వారోత్సవాలకు అడిషనల్ డీజీపీ సంజయ్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని అన్నారు.
ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ వాహన చోదకులు అతివేగంగా వాహనాలను నడపవద్దని మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది అనేది దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేయాలని అన్నారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం పలువురు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ప్రభాకర్, సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్‌ఐ మహేందర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






