24 April, 2026 | 4:14 AM

లోక్‌సభ ఎన్నికకు సర్వం సిద్ధం

12-05-2024 12:25 AM

2124 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్

జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్

మెదక్, మే 11(విజయక్రాంతి) : రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ బాలస్వామి, సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎటువంటి సమా వేశాలు నిర్వహించరాదని సూచించారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని, సోషల్ మీడియా, టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌లలో ప్రచారం నిషే దమని చెప్పారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉంద ని, ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు చేయరాదన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేదమని, ఓటరు స్లిప్పులో పార్టీ గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు. ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని అన్నారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలన్నారు. 

పార్లమెంట్ పరిధిలో 2124 పోలింగ్ స్టేషన్లు

మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 2124 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటి పరిధిలో 18,28,210 ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఇందులో 1244 లోకేషన్లు ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను 85 శాతం వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణ టీమ్స్ 24గంటల పాటు నిరంతరాయంగా పటిష్ట నిఘాలో ఉండాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు, కౌంటింగ్ రూం, స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియోగ్రఫీ చేయ డం, పటిష్ట భద్రత చర్యలు తదితర అంశాల పై అధికారులకు సూచనలు చేశామన్నారు. 

241 మంది బైండోవర్ జిల్లా ఎస్పీ బాలస్వామి

నియోజకవర్గం పరిధిలో 45 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ బాలస్వామి తెలిపారు. అదనపు బలగాలు, డీఎస్పీ, సీఐస్థాయి నుంచి బందోబస్తు నిర్వహిస్తారని, 48గంటలు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందన్నారు. మొత్తం 171 కేసులకు గాను 241మందిని బైండోవర్ చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 88లక్షల నగదు, 3400 లీటర్ల మద్యం, 2 వేల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యన్ని సీజ్ చేశామని, మొత్తం రూ.1.45 కోట్ల వరకు ఉంటుందన్నారు. సమావేశంలో డీపీఆర్వో రామచంద్రరాజు, ఎన్నికల పర్యవేక్షకులు హరిదీప్ సింగ్ పాల్గొన్నారు.