10-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. నియోజకవర్గంలోని సగానికి పైగా పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అసాధారణ భద్రతా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సమగ్రంగా వివరించారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారని కర్ణన్ తెలిపారు. వీరిలో 1,908 మంది దివ్యాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది, 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లు 6,859 మంది ఉన్నారని వివరించారు.
ఓటర్ల సౌకర్యార్థం 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా, వీటిలో 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక క్రిటికల్ కేంద్రాలుగా గుర్తించి, అక్కడ కేంద్ర బలగాలతో సహా అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియను డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు
ఈ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండటంతో, సాంకేతికంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్తో పాటు నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఇది ఓటర్లు గమనించాల్సిన కీలకమై న అంశమన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీప్యాట్లను సిద్ధంగా ఉం చామన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా స్పందించేందుకు 40 మం ది ఈసీఐఎల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచా మన్నారు. మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని చెప్పారు.
పటిష్ట భద్రత, ఓటర్లకు సౌకర్యాలు
ప్రశాంత పోలింగ్ కోసం నగర పోలీసులతో పాటు, ఐటీ, ఎక్సైజ్, నార్కోటిక్స్ వంటి వివిధ విభాగాలతో కూడిన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ నిరంతరం పనిచేస్తోందన్నారు. అన్ని 407 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు, ఎన్నికల సంఘం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఓటర్ల సహాయార్థం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్లు, క్యూలైన్లను పర్యవేక్షించేందుకు ఎన్సీసీ వాలంటీర్లు, పోలింగ్ కేంద్రం లోకి ప్రవేశించే ముందు ఓటర్లు తమ మొబై ల్ ఫోన్లను భద్రపరుచుకునేందుకు మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు, రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఉల్లంఘనలపై ఉక్కుపాదం.. రూ.3.60 కోట్లు స్వాధీనం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 27 కేసులు నమోదు చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వై లెన్స్ బృందాలు కలిసి రూ. 3,60,50,952 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కర్ణన్ వెల్లడించారు. ప్రచారం ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు తావివ్వ కుండా నిఘా కొనసాగుతుందన్నారు.
వేతనంతో కూడిన సెలవు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్కు ముందు రోజు నవంబర్ 10, సోమవారం, పోలింగ్ రోజు నవంబర్ 11, మంగళవారం, కౌంటింగ్ రోజు నవంబర్ 14, శుక్రవారం వేతనంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్లందరూ నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.