దంచికొట్టనున్న వానలు
- రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా నైరుతి
- ఆరు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆరు రోజుల పాటు వానలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నిర్మల్ జిల్లాలో ఈదురుగాలులకు విద్యుత్ సంభాలు కూలిపోయి 12 గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. కడెం మండల కేంద్రంలో రైస్ మిల్ షెడ్డు కుప్పకూలింది. కడెం రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కుంటాల, నర్సాపూర్, లోకేశ్వరం లో వర్షం దంచి కొట్టింది. మంగళవారం (నేడు) జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, బుధవారం ఆదిలాబాద్, కోమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి.
శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.






