calender_icon.png 17 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

16-12-2025 06:46:29 PM

పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలు బుధవారం జరుగుతుండగా ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా హైస్కూల్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి మూడో విడత ఎన్నికలలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులకు కేటాయించబడిన పిఓ, ఓపిఓల రిపోర్టింగ్ కౌంటర్ ను కలెక్టర్ సందర్శించి అప్పటివరకు ఎంతమంది రిపోర్ట్ చేశారని అడిగి తెలుసుకున్నారు.

డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రంలో ఆయా పోలింగ్ కేంద్రాల ఎన్నికల అధికారులను తీసుకున్న పోలింగ్ మెటీరియల్ ను పరిశీలించారా అని రిటర్నింగ్,  పోలింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించబడినట్లు మొబైల్ ఫోన్ కు వచ్చిన సందేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన వాహన సదుపాయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ మెటీరియల్, పోలింగ్, కౌంటింగ్ అంశాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. 

కాగా హనుమకొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలు ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు బుధవారం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయా మండల కేంద్రాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుండి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకొని  పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలు: 04

ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు ఉండగా, ఇందులో గ్రామ పంచాయతీలు - 67  (మొత్తం 68, ఏకగ్రీవం - 1) ఉన్నాయి. వార్డులు - 563 (మొత్తం - 634, ఏకగ్రీవం -71) ఓటర్లు : 111822 (పు: 54293 స్త్రీ: 57528, ఇతర: 1) ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధులలో పిఓ - 626, ఓపిఓలు - 897 ఉన్నారు. మొత్తం సిబ్బంది - 1523 ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. బుధవారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొదటి, రెండు దశలు ఇప్పటికే పూర్తికాగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆత్మకూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.