calender_icon.png 5 May, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాష్ట్రంలో అంతా అసంతృప్తే...

20-04-2025 12:00:00 AM

అమ్మా తెలంగాణమా.. నా ఆకలి కేకల గానమా... అన్న గద్దర్ గానానికి, ‘ఎయ్ రా డప్పుల్ల దరువెయ్ రా.. తల్లి తెలంగాణ పాట పాడరా... అన్న విమలక్క పాటకి ఊపందుకున్నది తెలంగాణ ఉద్యమం. ‘సకల జనుల సమ్మె’తో ఉవ్వెత్తున ఎగిసి, కేంద్ర సర్కారును కదిలించి స్వరాష్ర్ట సాధనకు మూలమైంది.

అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ‘ఎండమావి’గా మారిందని.. స్వరాష్ర్టంలో అంతా అసంతప్తే మిగిలిందంటున్నారు తెలంగాణ ఉద్యమ నాయకులు టీజేఏసీ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ తునికి రాఘవులు. ఉద్యమ అనుభవాలు ఆయన మాటల్లోనే.. 

తెలంగాణ 10 జిల్లాల్లో జోరుగా కొనసాగిన ఉద్యమంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో సైతం ఉద్యమం ఊపందుకుంది. అందులో భాగంగా తెలంగాణ కార్యాచరణ సమితి (జేఏసీ) కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంటుకు నాయకత్వం వహించిన రిటైర్డ్ టీచర్ తునికి రాఘవులు నేతృత్వంలో సకల జనుల సమ్మె అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో ఇక్కడ 108 రోజులపాటూ నిరవధికంగా నడిచింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనకు, ఆశయానికి ప్రతిరూపం. 10 జిల్లాల్లో గ్రామ గ్రామాన అందర్నీ చైతన్యపరచాలన్న జయశంకర్ సార్ సూచన మేరకు జేఏసీ నాయకులు పనిచేశారు. 

ఊరికొక్క ఉద్యోగం కూడా రాలేదు! 

తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించాం. కానీ కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఇంటికొకటి కాదు కదా కనీసం ఊరికొక్క ఉద్యోగమైనా రాలేదు. పైపెచ్చు రాష్ర్టవ్యాప్తంగా నిరుద్యోగం ఇంకా పెరిగింది. ఉద్యోగాల భర్తీ అంశం పక్కన పెట్టి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివద్ధి అంటూ మన ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. 

ఉమ్మడి రాష్ర్టంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఉద్యోగులకు సొంత రాష్ర్టంలోనూ ఇబ్బందులే మిగిలాయి. ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో ఎంతో కీలకమైన 610 జీవో అందని ద్రాక్షగా మారింది. ఉద్యోగుల జీతభత్యాలు బకాయిలు వాయిదాలు తప్ప చేతికొచ్చిందేమీ లేదు. పలు రకాల సమస్యలతో ఇటు ఉద్యోగులు, ఉద్యోగాలు రాక అటు నిరుద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారు.   

 బట్టు హరికష్ణ, జగిత్యాల