calender_icon.png 5 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్బంధాలకు బెదరలేదు!

20-04-2025 12:00:00 AM

బంచాన్ నీ కాల్మోక్త అన్న బక్కొనితో బందూకు పట్టించిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కితే. సబ్బండ కులాలను ఉద్యమ బాట పట్టించిన మలిదశ చరిత్ర తెలంగాణ ఉద్యమానిది. ఈ ఉద్యమంలో పాల్గొనని కులం, మతం లేదంటే అతిశయోక్తి కావచ్చు కానీ అది నిజం. కులాలకు అతీతంగా ఉద్యమం రంగంలోకి దూకినా ఇంకా వారి ఆకాంక్షలు నెరవేరనేలేదు. సాధించుకన్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు మిగిలే ఉన్నాయి అంటున్నాడు ఓయూ పరిశోధక విద్యార్థి అవాల హరిబాబు..

స్వరాష్ర్ట ఏర్పాటుతో మాలాంటి వాళ్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనాడు విద్యార్థులుగా ఉన్న మేం ఆలోచించాం కాబట్టే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఒక్క మేమే కాదు రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామ చేయడం, సబ్బండ కులాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనడం ఇలా అందరి ఆశ ఒక్కటే స్వరాష్టంలో మా బతుకులు బాగుపడుతాయని.

అదే మమ్మల్ని ఉద్యమంపైపు నడిపించింది. అడుగడుగునా తెలంగాణకు జరగుతున్న అన్యాయాన్ని చూసిన ముందు తరం ఉద్యమానికి నాయకత్వం వహించి  దిశా నిర్దేశం చేస్తే మేం వారి పిలుపును ముందుకు తీసుకెళ్ళాం.

మా మొదటి కార్యక్రమం..

సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ చేనేత దీక్ష పెట్టింది. ఆంధ్రా పెత్తనం కింద తెలంగాణ ప్రజలు ఇంకెంత కాలం బానిసలుగా పనిచేయాలని నాటి టీఆర్‌ఎస్ పిలుపులో భాగంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.  అప్పుడు నేను టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగంలో ఉన్నా. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా.

ఆ నిరసన కార్యక్రమాన్ని జరగకుండా చేయాలనే ఉద్దేశంతో అడ్డుకోవడంతో అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం మాపై లాఠీచార్జీ చేసింది. అయినా నిర్బంధాలకు బెదరలేదు. దాంట్లో చాలామంది కార్యకర్తలతోపాటూ  నేను కూడా తీవ్రంగా గాయపడి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. మమ్మల్ని పరామర్శించడానికి నాటి టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటల రాజేందర్ ఇతర నేతలు హరీష్ రావు, దేశపతి శ్రీనివాస్ వచ్చారు. 

రెండో కార్యక్రమం..

రెండోవసారి టీడీపీ పార్టీ తరపున ఎంపీలంతా కలిసి క రీంనగర్‌లో రణభేరీ అనే ప్రోగ్రాం పెట్టారు. దీంట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నేతలంతా దాంట్లో పాల్గొన్నాం. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిస్తే మేం హుజురాబాద్ నియోజకవర్గంలో అందులో కూడా పాల్గొన్నా. దారి పొడవునా చెట్లు నరికేసి నిరసన వ్యక్తం చేస్తే ఆ సందర్భంలో కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి.

రమేష్ అనే అతన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. ఇలా ఎన్ని ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టినా లక్ష్యం ముందు ఇవేమీ లెక్కచేయకుండా ముందుకు సాగాం. ఇలాంటి తొలినాటి ఘటనలు చాలా ఉన్నాయనే చెప్పవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీలో..

నేను ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిన కొత్తలో సీమాంధ్ర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకుడు ఆశోక్ బాబు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగుల పేరుతో ఎల్‌బీ స్టేడియంలో సమైక్యాంధ్ర ఘర్జన నిర్వహించాడు. ఇక్కడి వనరులను దోచుకుంటూ, ఇక్కడి ప్రజల్ని , ఇక్కడి భాషను, యాసను అవమానిస్తూ కూడా ఇంకా ఇక్కడి ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా సభలు నిర్వహించడం ఉద్దేశం అన్నమాట.

అంటే తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడమే. ఇటువంటి ప్రోగ్రామ్స్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో తెలంగాణ విద్యార్థి, యువతరం ఆ ఘర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా.  ఆ ఘటన సందర్భంలోనే పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి రెండు రోజులు హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఉద్యమంలో నాపై దాదాపు 10 కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణ బిడ్డగా.. గర్విస్తున్నా..

నాడు ఉద్యమంలో పాల్గొనడం గర్వకారణంగా ఫీల్ అవుతున్నా.. మలిదశ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, సైకిల్ యాత్ర, ఎమ్యెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన బయ్యారం బస్సుయాత్ర ఇలా అనేక మరుపురాని ఉద్యమ కార్యక్రమాల్లో నాపాత్ర ఎంతో కొంతమేరకు ఉందనే చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమం ఎల్లలు లేని ఆత్మీయతను నెలకొల్పింది. కులాలు, మతాలకు అతీతంగా అందరూ కలుపుకునేలా ఉద్యమ కార్యాచరణ రూపొందింది. సబ్బండ కులాలు ఏకమైన సందర్భంలో ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే చూడగలం. ఇక ఏ ఉద్యమంలో ఇలాంటిది ఉద్యమం కానరాదు మనకు. 

బాధకు గురిచేసిన సంఘటన అదే!

కళ్లముందే అనేకమంది యువకులు, విద్యార్థులు చనిపోవడం బాధకు గురిచేసింది. ఉస్మానియా యూనివర్సి టీలో ఉన్న కాలంలో విద్యార్థులు వచ్చి తెలంగాణ కోసం ఆత్మహత్యచేసుకోవడం, మా చావుల ద్వారా అయినా తెలంగాణ రాష్ర్టం సిద్దించాలని కోరుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసేవి. ఎన్నో నిద్రలేని రాత్రులను కలిగించాయి. ఏ ఉద్యమంలో ఇలాంటి ఘటనలు జరగకూడదు. 

సాధించుకున్న తెలంగాణలో..

రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో ముందడుగు వేసిందనే చెప్పవచ్చు. రాష్ర్ట తలసరి ఆదాయంలో తీసుకున్న, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అయినా, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడం, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబందు వంటి పథకాల విషయంలో అనేక రంగాల్లో తెలంగాణ పురోగతి సాధించిందనే చెప్పవచ్చు. 

నెరవేరని ఆకాంక్షలు..

తరతరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఒకేరోజులో పూడ్చడం ఏ ప్రభుత్వానికి సాధ్యంకాదు. అయినప్పటికీ ప్రగతిపథంలో సాగుతూనే వుంది. అయితే ఇప్పటికి కొన్ని ఆకాంక్షలు మిగిలే ఉన్నాయి. భౌగోళికంగా రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ సామాజికంగా అన్నీ వర్గాలను ముందుకు తీసుకెళ్లే క్రమం మిగిలే ఉంది. దళితులు, బీసీలకు, మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాల్సి వుంది. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది. విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందే వరకు ఆ ఆకాంక్షలు మిగిలే వుంటాయి. 

ఉద్యమకారులను పట్టించుకోలేదు..

గత ప్రభుత్వం ఉద్యమకారులను ఏమీ పట్టించుకోలేదు అనేది అర్థ సత్యం. ఏ పార్టీ అవకాశం కల్పించనన్ని అవకాశాలు ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ పార్టీ కల్పించింది. మొదటి సారి విద్యా ర్థులకు ఎమ్మెల్యే, కార్పోరేషన్ పదవులు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిదే. అలా అని అన్నీ చేసిందని చెప్పలేం కానీ చాలా వరకు ఉద్యమకారులను పట్టించుకుంది.

అలాగే ఉద్యమకారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే డిమాండ్స్ మిగిలేవున్నాయి వాటిని కూడా నెరవేర్చాల్సి వుంది. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. వీటితో పాటు తమ చదువులను పక్కన పెట్టి ఉద్యమాన్ని రగిల్చిన యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

విద్యారంగం నిర్లక్ష్యానికి గురైంది..

ఏదో ఒక వర్గం నష్టపోకుం డా ఏ ఉద్యమం జరగదేమో. ఈ ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది విద్యార్థి రంగమే. ప్రత్యేక తెలంగాణలో వ్యాపారస్తులు, భూస్వాములు, రియల్‌ఎస్టేట్ రంగం, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఏదో మేరకు లబ్ధిపొందినవారే కానీ విద్యార్థులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైనారని చెప్పవచ్చు.

గురుకులాలు వంటి కొన్నింట్లో కొంత మార్పు వచ్చినప్పటికీ మిగతా విద్యారంగం అంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే చెప్పవచ్చు. అనుకున్నంత ప్రొత్సాహం విద్యారంగానికి దక్కలేదనే చెప్పవచ్చు.