20-07-2024 12:11:53 AM
నిజామాబాద్, జూలై 19(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన యూనియన్ బ్యాంకు మేనేజర్ ఫ్రాడ్ కేసు లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శుక్రవారం నిందితుడిపై ఛీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటి వరకు 24 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి పేర్లపై రూ.3.10 కోట్ల లోన్లు తీసుకున్నారని, కొద్దిమంది మేనేజర్‌కు హ్యాండ్‌లోన్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
భార్య, బంధువుల ఖాతాల్లోకి..
శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ బ్రాం చ్ మేనేజర్ పినపాటి అజయ్ తన కుటుంబంతో సహా హైదారాబాద్‌లో నివసిస్తున్నా డని, అతని భార్య ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అధికారి హోదాలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖాతాదారుల నుంచి సేకరించిన రుణాలకు సంబంధించిన డబ్బును అజయ్ తన భార్య పేరుతో ఉన్న అకౌంట్ తో పాటు, బంధువల అకౌంట్లకు మల్లించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మేనేజర్ ఖాతాదారుల పేరుమీద రుణాలు ఎలా తీసుకున్నాడు, ఆ డబ్బులను ఎలా తన అకౌంట్లకు తరిలించాడని విచారణ జరుపుతున్నారు.
చర్యలు తీసుకోని డీజీఎం
మేనేజర్ చేస్తున్న అక్రమాలపై కొంత మంది ఖాతాదారులు డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు గత జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఫిర్యాదు చేసినా సదరు అధికారి మౌనంగా ఉన్నట్లు తెలిసింది. ఖాతాదారులు పాస్‌పోర్ట్ ఆఫీసు పైన ఉన్న యూనియన్ బ్యాంకు కార్యాలయంలో డీజీఎంను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించినప్పుడు శివాజినగర్ బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకో వాల్సింది పోయి ఖాతాదారులనే చీవాట్లు పెట్టినట్టుగా తెలిసింది. ఆ అధికారి త్వరలో బదిలీ అవుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోకుండా ఖాతాధారులను తిరిగి మేనేజర్ వద్దకే వెళ్లి తేల్చుకోవాల్సిందిగా సూచించార ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని వారంటున్నారు. డీజీఎం పాత్రపైనా విచారణ జరపాలని ఖాతాదారులు కోరుతున్నారు.
సీపీకి గోడు వెళ్లబోసుకున్న ఖాతాదారులు
మోసపోయిన ఖాతాదారులు నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదనను విన్న సీపీ ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మొదటిదైన ఐటీ బృం దం.. బ్యాంకు మేనేజర్ నగదు లావాదేవీలు ఎలా జరిపాడు, ఒకరి పేరుతో రుణాన్ని మంజురు చేసిన తర్వాత తన ఖాతాకు ఎలా పంపాడు, ఎంతమందిపై రుణాలు తీసుకున్నాడు లాంటి టెక్నికల్ అంశాలను పరిశీలి స్తుంది. రెండోది.. పరారీలో ఉన్న మేనేజర్ ఆచూకీ తెలుసుకుని, అదుపులోకి తీసుకునేందుకు నియమించారు. మూడో బృందం నిజామాబాద్ సీఐ నరహరి ఆధ్వర్యంలో బాధితుల ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు ఎంత మంది మోసపోయారు అన్న కోణంలో విచారించనున్నారు.