17-09-2025 02:34:31 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఒకప్పుడు కబ్జాల చెరలో చిక్కి, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి ఉనికినే కోల్పోయే దశకు చేరుకున్న బతుకమ్మ కుంట.. ఇప్పుడు పునరుజ్జీవం పొంది బతుకమ్మ ఉత్సవాలకు వేదిక కాబోతోంది. ఈ నెల 25న ఇక్కడ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై.. సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మకుంటను నగర ప్రజలకు అంకితం చేయనున్నారు.
ఉత్సవాల ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఏర్పాట్లను వారికి వివరించారు. ఈ సందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మకుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
బతుకమ్మకుంట పునరుద్ధరణలో హెచ్‌ఎండీఏ కృషిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీనియర్ నేత వి హనుమంతరావు కొనియాడారు. చూడటానికే భయపడేలా ఉన్న బతుకమ్మకుంటకు జీవం పోసిన ఘనత హెచ్‌ఎండీఏదే అని, కమిషనర్ రంగనాథ్ దీన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేశారు అని అభినందించారు.
ఈ నెల 25న జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ పార్టీలకతీతంగా పాల్గొని బతుకమ్మ ఆడి వేడుకలను విజయవంతం చేయాలని మేయర్, వీహెచ్ పిలుపునిచ్చారు. నగరంలో తొలి విడతగా చేపట్టిన ఆరు చెరువుల్లో బతుకమ్మకుంట మొదటిగా పూర్తికావడం ఆనందంగా ఉందని వీహెచ్ అన్నారు.