calender_icon.png 17 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్ పిలుస్తోంది!

17-09-2025 02:01:15 AM

వ్యాపార స్వర్గధామానికి పెరుగుతున్న వలసలు

నేను ఇటీవల దుబాయ్, అబుదాబికి వెళ్ళినప్పుడు భారతదేశానికి చెందిన అనేకమంది వ్యాపారవేత్తలతో, ప్రముఖులతో సంభాషించాను. వారంతా దుబాయ్‌లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడం, వ్యాపారాలు చేయడానికి దుబాయ్‌ని ఎందుకు ఎంచుకున్నారనే అంశంపై మాట్లాడుతున్న క్రమంలో అనేక ఆసక్తికరమైన అంశాలు, వాస్తవాలు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అర్థం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వాలు ఈ వాస్తవాలను గ్రహించాలనే ఉద్దేశంతో నా ఆలోచనలను పంచుకుంటున్నాను.

సంపద వలస, ప్రతిభావంతుల వలస పెరగడం వంటి సమస్యలను భారతదేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అవినీతిరహిత, సమర్థవంతమైన, సురక్షితమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తున్న భారతీయ వ్యాపార నిపుణులను దుబాయ్ ఒక అయస్కాంతంలా ఆకర్షించింది.

ఎమిరేట్స్ దేశంలో తక్కువ పన్నులు, సజావుగా కొనసాగే వ్యాపార కార్యకలాపాలు, మంచి జీవన ప్రమాణాలు వంటి అంశాలు గణనీయమైన మార్పుకు దారితీస్తున్నాయి. 20వ శతాబ్దం చివరలో మేధోవలసలతో పాటు ప్రస్తుతం సంపద కూడా తరలిపోవడం భారతీయ విధాన రూపకర్తలకు హెచ్చరిక ఘంటికలు మోగిస్తున్నాయి. 

* ‘దుబాయ్ దార్శనిక నాయకత్వం ఒక కలల గమ్యస్థానాన్ని సృష్టించింది. తన వాణిజ్య, వ్యాపారవర్గాలు దేశం వీడకుండా ఉండేందుకు భారత్ తగిన చర్యలు సత్వరం తీసుకోవాల్సి ఉంది. లేకుంటే సంపద, ప్రతిభ రెండింటినీ కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యూఢిల్లీకి చెందిన ఆర్థికవేత్త డాక్టర్ అనిల్ శర్మ చెప్పారు. 

* అన్ని స్థాయిల్లో అవినీతి అంతం కావాలి. సరళీకృత విధానాలకు స్వేచ్ఛగా, పారదర్శకంగా సులభతర వాణి జ్యం జరగాలి. అలాగే స్వేచ్ఛయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియనంతా పూర్తిచేసుకోవాలి.  బంధుప్రీతిని వదిలితేగాని భారతదేశంలో జీవనం అత్యున్నత స్థాయికి చేరదు. ఒక రాజకీయ లక్ష్యంతో అధికారంలోకి  వచ్చినవారు అందలాలు ఎక్కామని కాకుండా, ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని భావించాలి.

 

వ్యాపార- అనుకూల వ్యవస్థలో దుబాయ్ ఆకర్షణ దాగి ఉంది. ఆదాయంపై 5 శాతం కంటే తక్కువ పన్ను రేటు, చాలా సందర్భాలలో వ్యక్తిగత ఆదాయ పన్ను లేకపోవడం, నగరం అనేక ప్రపంచ కేంద్రాలతో పోటీపడుతూ సాటిలేని విధంగా ఆర్థిక స్వేచ్ఛను అందిస్తున్నది. ఆసక్తి ఉంటేచాలు.. వ్యాపారవేత్తలు 24 గంటల్లోపు కంపెనీలను స్థాపించవచ్చు, అధికారిక అడ్డంకులు ఉండవు. నియంత్రణ సంస్థల వేధింపులు ఉండవు.

భారతదేశంలో వ్యాపారవర్గాలు తరచుగా ఎదుర్కొనే అనేకానేక సవాళ్లకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ‘ఇక్కడ ఐటీ, సీబీఐ లేదా ఈడీ మీ తలుపు తట్టవు’ అని దుబాయ్‌లోని ఒక భారతీయ ప్రవాస వాణిజ్యవేత్త చెప్పారు. వ్యాపారులు ముందు చెప్పిన ఉత్పాదకత కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకత స్థాయిలను చూపడమే ఎమిరేట్స్ దేశంలోని మెరిట్ ఆధారిత వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తుంది.

అనేక దేశాలలో నిరంతర సమస్యగా ఉన్న అవినీతి, దుబాయ్ వ్యాపార కార్యకలాపాలలో మచ్చుకు కూడా లేదు. దుబాయ్‌లోని పారదర్శక ప్రక్రియలు, అనుమతులు, అధునాతన సాంకేతికతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకునే వాణిజ్యం, ఆర్థికం, జ్ఞానం అందుబాటులో ఉం డటం ఇక్కడ ఎంతో సంతోషకరమైన విషయం.

భద్రత, జీవన నాణ్యత..

వ్యాపారానికి మించి, దుబాయ్ అసమానమైన జీవన నాణ్యతను అందిస్తుంది. ఈ నగరం లో నేరాలకు ఏమాత్రం తావివ్వరు. వారంలోపు న్యాయం జరుగుతుంది,  దొంగతనం లేదా ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు లేవు. మాదకద్రవ్యాలు, గూండాగిరి సమస్యలు లేకపోవడంతో ఇక్కడ సురక్షితమైన వాతావరణం ఉం టుంది. మహిళలు సహా అంతా అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగవచ్చు. తాము కోరుకున్న విధంగా దుస్తులు ధరించవచ్చు.

ఏడాదిలో ఐదు నెలలపాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ గానే ఉండడంతో వర్షం, పచ్చదనం కనిపించవు. కఠినమైన ఎడారి వాతావరణం ఉన్నప్ప టికీ -నాణ్యత, కల్తీ లేని ఆహారం, స్వచ్ఛమైన నీరు, నమ్మదగిన విద్యుత్ వంటి అంశాలు దుబాయ్ పట్ల ఆకర్షణను పెంచుతాయి. -దుబాయ్‌లోని ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు దీనిని సమగ్ర గమ్యస్థానంగా చేస్తున్నాయి.

‘నేను భారతదేశంలోని నా ఆస్తులను అమ్మేసి, నా పిల్లలకు మెరుగైన, భద్రమైన భవిష్యత్తును అందించడానికి ఇక్కడికి వచ్చాను’ అని ముంబైకి చెందిన ఒక రిటైర్డ్ వ్యాపార యజమాని చెప్పడం దుబా య్, లండన్, యూఎస్ వంటి గమ్యస్థానాలకు సంపద బదిలీ పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నది. 

భారతదేశ సంపదకు ముప్పు..

ప్రస్తుతం ఉన్న ఈ వలస 1960 నాటి మేధోవలస నుంచి సంపద తరలించే కొత్త యుగానికి మారడాన్ని సూచిస్తుంది. గతంలో ఎన్నారైలు డబ్బును ఇక్కడికి పం పించే పరిస్థితులకు భిన్నంగా ఇప్పటి భారతీయ తల్లిదండ్రులు ఆస్తులను డబ్బుగా మార్చి తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడటానికి నిధులు సమకూర్చుతున్నారు. ఇక్కడి వ్యా పారులు దుబాయ్ పాలనను ప్రశంసిస్తూనే, భారతదేశంలోని సంక్లిష్ట పన్నులు, వ్యాపారంలో రాజకీయ జోక్యాన్ని గురించి ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చేసే వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయి.

‘దుబాయ్ దార్శనిక నాయకత్వం ఒక కలల గమ్యస్థానాన్ని సృష్టించింది’ అని న్యూఢిల్లీకి చెందిన ఆర్థికవేత్త డాక్టర్ అనిల్ శర్మ అన్నారు. ‘భారతదేశం తన వాణిజ్య, వ్యాపారవర్గాలు దేశం వీడకుండా ఉండేందుకు తగిన చర్యలు సత్వరం తీసుకోవాల్సి ఉంది. లేకుంటే మనం సంపద, ప్రతిభ రెండింటినీ కోల్పో యే ప్రమాదం ఉంది’ అని ఆయన చెప్పారు. 

భారతదేశానికి మేల్కొలుపు..

2014-2019 మధ్య ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో భారతదేశం 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎగబాకి పురోగతి సాధించింది. డిజిటల్ ఇం డియా, జీఎస్టీ వంటి చర్యలతో తమ విధానాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టు కున్నప్పటికీ అవినీతి, న్యాయ వ్యవస్థ లో జాప్యం, నియంత్రణలతో వేధింపులు కొ నసాగుతునే ఉన్నాయి. దుబాయ్‌తో పోటీ పడటానికి, నిపుణులు భారతదేశానికి కొన్ని విజ్ఞప్తు చేస్తున్నారు:  

* ప్రపంచ వాణిజ్య కేంద్రాలకు సరితూగేలా పన్నులను సరళీకృతం చేయాలి, పన్నులు తక్కువ రేట్లలో ఉండాలి.

* అవినీతిని తొలగించడానికి ప్రక్రియలను డిజిటలైజ్, పారదర్శకం చేయాలి. 

* ఆస్తి హక్కులను బలోపేతం చేయాలి, న్యాయం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలి. 

* జీవన ప్రమాణాలను పెంచేందుకు మౌ లిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యలో పెట్టుబడులను అధికం చేయాలి. 

ముందున్న మార్గం..

ప్రస్తుతం మన పాలకులు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి చెబుతున్నారు. ప్రపంచంలో ఆర్థికంగా వృద్ధి చెందుతున్న దేశాల సరసన మనదేశం ఉండేందుకు ఆర్థికరంగంలో పరుగులు తీసేందుకు ఎన్నో చర్యలు అవసరం. అన్ని స్థాయిల్లో అవినీతి అంతం కావాలి. సరళీకృత విధానాలకు స్వేచ్ఛగా, పారదర్శకంగా సులభతర వాణి జ్యం జరగాలి. అలాగే స్వేచ్ఛయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియనంతా పూర్తిచేసుకోవాలి. బంధుప్రీతిని వదిలితేగాని భారతదేశంలో జీవనం అత్యున్నత స్థాయికి చేరదు. ఒక రాజకీయ లక్ష్యంతో అధికారంలోకి  వచ్చినవారు అందలాలు ఎక్కామని కాకుండా, ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని భావించాలి. 

ఎంతమాత్రం అనుకూలించని వాతావరణం ఉన్నప్పటికీ పాలకుల దార్శనికత, అవినీతి అంతం దుబాయ్ విజయానికి కారణమయ్యయి. భారత్ ఇప్పటికైనా సమున్నత లక్ష్యాలను నిరేశించుకోవాలి. సుల భతర వాణిజ్యం, అవినీతిని పూర్తిగా పారద్రోలడం జరగగపోతే మన సంపద ఇతర దేశాలకు రెక్కలు కట్టుకొని వెల్లడం ఖాయం. ఇది మన ఆర్థిక ప్రగతికి అవరోధం.  ‘భారత విధాన నిర్ణేతలు వినాల్సిన అవసరం ఉంది.. దుబాయ్ కేవలం ఎడారి కాదు, కలలను సాకారం చేసుకొనేది ఎలాగో చెప్పే ఒక పాఠం.’ అని ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది నిజం.

విదేశీ వలసలు.. 

హై నెట్ వర్త్ ఇండివిడ్యూవల్స్ (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) అంటే కనీసం 1 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టగల ఆస్తులు కలిగినవారు అని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్, న్యూ వరల్డ్ వెల్త్ ప్రతి సంవత్సరం విడుదల చేసే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు తెలిపింది. గత దశాబ్ద కాలంలో భారతదేశం నుంచి ఇలాం టి ధనవంతుల వలసలు ఎక్కువయ్యాయి. 2015 నుంచి 2024 వర కు విదేశాలకు వెళ్లిన భారతీయ హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల మొత్తం సంఖ్య సుమారు 47 వేలు ఉంది. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి