calender_icon.png 11 July, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

33.98 బిలియన్ డాలర్లకు తగ్గిన ఎగుమతులు

15-08-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత్ వస్తూత్పత్తుల ఎగుమతులు జూలై నెలలో 1.2 శాతం తగ్గి 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నిరుడు ఇదే నెలలో 34.39 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. జూలై నెలలో దిగుమతులు మాత్రం 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. 2023 జూలైలో ఇవి 53.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024 జూలైలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్యలోటు 23.5 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.

ఈ గణాంకాల్ని బుధవారం కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ మీడియాకు వివరిస్తూ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ ఏడాది వస్తూత్పత్తులు, సేవల ఎగుమతులు గత ఏడాది స్థాయిని దాటతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో ఎగుమతులు 4 శాతం వృద్ధితో 144.12 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 7.57 శాతం వృద్ధిచెంది 229.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 

చైనా నుంచి దిగుమతుల జోరు

వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం చైనా నుంచి జూలై నెలలో దిగుమతులు భారీగా పెరిగాయి. 13 శాతం వృద్ధిచెంది 10.28 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఆ దేశానికి భారత్ చేసిన ఎగుమతులు 9.44 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకూ చైనా నుంచి దిగుమతులు 9.66 శాతం పెరిగి 35.85 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 4.54 శాతం తగ్గి 4.8 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో చైనాతో భారత్ వాణిజ్య లోటు 31.31 బిలియన్ డాలర్లకు పెరిగింది. యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేషియా, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, నేపాల్, బ్రెజిల్, బెల్జియం, టర్కీ, ఇండోనేషియా దేశాలకు కూడా భారత్ ఎగుమతులు జూలై నెలలో తగ్గాయి. కానీ యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, మెక్సికోలకు ఎగుమతులు పెరిగాయి.