22-09-2025 01:42:58 AM
-ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
-కృష్ణానదీ జలాల పంపిణీలోన్యాయం దక్కేవరకు పోరాటం ఆగదు
-ఢిల్లీలో రేపు జరిగే కృష్ణా ట్రిబునల్ సమావేశంలో బలమైన వాదనలు వినిపిస్తాం
-గత పాలకుల నిర్లక్ష్యంతోనే కృష్ణానదీ జలాల వివాదం
-లక్ష కోట్ల కాళేశ్వరంలో 3 బరాజ్‌లు మూడేండ్లకే కుంగినయ్
-కాళేశ్వరం నీరు లేకపోయినా పంటల దిగుబడిలో గణనీయ పెరుగుదల
-నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, సెప్టెంబర్ 21: కృష్ణా, గోదావరి నీటి హక్కులు తెలంగాణకు దక్కేలా ప్రజాప్రభుత్వం నిరంతరం పోరా టం చేస్తుందని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని న్యాయం జరిగేవరకు పోరాడుతామని రాష్ర్ట భారీ నీటి పారుదల, సివిల్ సప్లు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల పంపకంలో గత పాలకులు పదేండ్లు నిర్లక్ష్యం చేయడంతో కృష్ణానదిలో 811 టీఎంసీలల్లో ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక నదీ పరీవాహక ప్రాంతం ఆయకట్టు, జనాభాను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. తెలంగాణకు 70 శాతం జలాలు కేటాయించాలని పోరాడుతున్నామని, ట్రిబ్యునల్ ముందు వాద నలు వినిపించామని స్పష్టం చేశారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతారని, ఆ రాష్ర్టంలో ముంపునకు గురయ్యే ప్రాంతం పెరగడంతో భూ సేకరణ చేసేందుకు బడ్జెట్ కేటాయించారని వార్తలోస్తు న్నాయని.. దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది రాష్ర్టంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడమనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, 2017 నుంచి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కానీ సుప్రీం కోర్టు వ్యతిరేకించడం వల్ల పెండింగ్‌లో ఉందని, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తుందన్నారు.
సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ అడ్వకేట్‌లతో ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. కర్ణాటక, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నీటి హక్కులు తెలంగాణకు దక్కేలా రాష్ర్ట ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు. అందుకు కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. గత పాలకులు లక్ష కోట్లతో కాళేశ్వరం పేరుతో 3 బ్యారేజ్‌లు నిర్మిస్తే, మూడేండ్లకే కుంగిపోయాయన్నారు.
యన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకపోయినా ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ విస్తీర్ణం పెరిగి, ఉత్పత్తి అధికమైందన్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్, జ్యూడీషియల్, ఎన్‌డీఎస్‌ఏ నివేదికల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తుమ్మడి హట్టి వద్ద ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని, వాటిని పునః ప్రారంభించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
జాన్‌పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సకాలం పూర్తి చేయాలి..
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ర్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పాలకీడు మండలం జాన్‌పహాడ్‌లో జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి డిసెంబర్ 31 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 10 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచి కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వ చివర భూములైన 53 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా పనులు జరుగుతున్నాయని, అలాగే దొండపాడులో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 14వేల ఎకరాలకు నీరు అందుతుందని, ఈ నీరు పులిచింతల ప్రాజెక్ట్‌లో విద్యుత్‌ను తయారు చేసిన తర్వాత సముద్రంలో కలిసే నీటిని ఎత్తిపోసి 14 వేల ఎకరాలకు సాగునీటి అందిస్తామన్నారు.
అనంతరం ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్‌కు మహాత్మాగాంధీముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా నామకరణం చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. తదుపరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ ఈ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.