calender_icon.png 22 September, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరవీడిన 317 ఎకరాలు

22-09-2025 01:39:55 AM

ఫోర్జరీ సంతకాలతో గాజులరామారంలో రూ.15 వేల కోట్ల సర్కార్ భూమి కబ్జా

-యథేచ్ఛగా వెంచర్లు, లేఅవుట్లు.. జోరుగా విక్రయాలు 

-రంగంలోకి హైడ్రా.. అక్రమ కట్టడాల కూల్చివేత

-బందోబస్తు నడుమ భూమి స్వాధీనం

-నిరుపేదల ఇళ్ల జోలికి వెళ్లం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కబ్జాదారుల భూదాహానికి ‘హైడ్రా’ చెక్‌పెట్టింది. రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించింది. కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రౌడీషీటర్ల కనుసన్నల్లో సాగిన ఈ దందా బట్టబయలు చేసింది. ఆ ప్రదేశంలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి ఆదివారం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది.

త్వరలో స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నది. మేడ్చల్మ ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని సర్వే నంబర్ 307తో పాటు ఇతర సర్వే నంబర్లలోని 317 ఎకరాల భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన ఈ భూమి, రాష్ట్రవిభజన తర్వాత ఏపీకి, తెలంగాణకు మధ్య ఆస్తుల పంపకాల్లో ఏర్పడిన జాప్యం కబ్జాదారుల పాలిట వరమైంది.

కొందరు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆ భూమిలో వెం చర్లు, లేఅవుట్లు వేశారు. కొందరైతే అక్కడ తాత్కాలిక కట్టడాలు సైతం నిర్మించారు. ప్రగతినగర్ వైపు  12 ఎకరాల్లో ఒక వెంచర్, 20 ఎకరాల్లో ఒక లేఅవుట్ వేసి ప్లాట్లుగా అమ్మేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయా ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లు, ప్రహరీలు, అంతర్గత రోడ్లు సైతం వెలిశాయి. కొన్ని కట్టడాలకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.

ఆ రౌడీషీటర్ల రూటే వేరు..

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, తిరిగి దానిని విక్రయించడంలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన షేక్ అబిద్, బోడా సు శ్రీనివాస్,డాన్ శీను, ఏసుబాబు, సయ్యద్ గౌస్‌బాబు అనే రౌడీషీటర్ల రూటే వేరు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని వీరు 60 లేదా 120 గజాల ప్లాట్లలా విభజిస్తారు. ఒక్కో ప్లాట్ చుట్టూ  ప్రహరీ, లోపల చిన్న గది నిర్మిస్తారు. అక్కడ నివాసం ఉండేందుకు పేద కుటుంబాన్ని  దింపుతారు. వారి నుంచి పైసా కూడా అద్దె తీసుకోరు. పేద కుటుంబం అక్కడ నివసిస్తూ ఉండగానే, ప్లాట్‌ను బేరం పెడతారు. సదరు స్థలం అప్పటికే నివాస స్థలమని నమ్మిస్తారు. మంచి ప్లాట్ దొరికిందని ఆశపడి పెట్టుబడిదారుడు ఆ ప్లాట్ కొని మోసపోయేలా చేస్తారు. ఈ మోసాల్లో స్థానిక రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

స్థానికులకు భరోసా..

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో స్థానికంగా నివాసం ఉంటున్న పేద ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాలకు భరోసా నిచ్చారు. పేదల ఇళ్ల జోలికి రాబోమని హా మీ ఇచ్చారు. కేవలం వెంచర్లు, ఖాళీ ప్లాట్లు, ప్రహరీలను మాత్రమే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ప్లాట్లు కొన్నవారి నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. హబీబ్ బస్తీలో కొందరు ఆందోళన కారులు జేసీబీలపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీపై రాళ్లు రువ్విన హబీబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్లు అమ్మి కొనుగోలుదారు ల ను మోసం చేసిన వారే, నివాసితుల ముసుగులో ఆందోళనలు సృష్టించేందుకు యత్నించారని పోలీసులు భావిస్తున్నారు.

నిరుపేదల ఇళ్ల జోలికి వెళ్లం..

గాజులరామారం భూకబ్జాలపై హైడ్రాకు పెద్దఎత్తున ఫిర్యాదులు అం దాయి. ఈ అంశంపై హైడ్రా సర్వే నంబర్ల వారీగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. భూమి కబ్జాకు గురైం దని గుర్తించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని కూల్చివేత ఆపరేషన్ చేపట్టాం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేద ల  ఇళ్లను కూల్చవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. నాయకులు, ‘రియల్’ వ్యాపారులు ఆక్రమించిన భూముల ను కబ్జా నుంచి విడిపించాం. అక్రమ కట్టడాలను తొలగిస్తున్నాం. కబ్జాదారు లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచా రణలో తేలింది. మొత్తం 275 ఎకరాల కు పైగా భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం.

 రంగనాథ్, హైడ్రా కమిషనర్