22-09-2025 01:52:36 AM
-భారత్‌పై అమెరికా హెచ్ వీసా బాంబ్
-నైపుణ్యాలు కలిగిన టెకీలకు సవాళ్లు
-శ్రీధర్‌బాబు, కేటీఆర్, లోకేశ్ వ్యూహకర్తలైతే బహుళ ప్రయోజనాలు
-వారి దార్శనికత, సమర్థతతో ‘గ్లోబల్ నెట్‌వర్కింగ్’ సులభం
-హైదరాబాద్, వైజాగ్ గ్లోబల్ టెక్ హబ్స్‌గా అవతరించే అవకాశం
-కొలువుల కేంద్రాలుగా రెండు రాష్ట్రాలు.. విదేశాల నుంచి తిరిగొచ్చే వారికి గమ్యస్థానాలయ్యే ఆస్కారం
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హెచ్x 1బీ వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచడం దిగ్గజ టెక్ సంస్థలకు గుదిబండగా మారింది. గ్లోబల్ టెక్ మైగ్రేషన్‌లో ఇదో పెద్ద కుదుపు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసా దరఖాస్తు రుసుము పెంపు కారణంగా టెక్ సంస్థ ప్రతి ఉద్యోగిపై 20,000 శాతం కంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందు కు ఆయా కంపెనీలు ముందుకువచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
దీంతో భారత్‌కు చెందిన నిపుణులకు ఈ కుదుపు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే వీసాలు కలిగిఉన్న వారికి కొంత వెసులుబాటు ఉన్న ప్పటికీ, కొత్తగా ఆశలు పెట్టుకున్న టెకీలకు ఆశాభంగం తప్పడం లేదు. మొత్తంగా సిలికాన్ వ్యాలీకి వెళ్లాల్సిన 5,00,000 మందికి పైగా ఉన్న తెలుగువారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఏదేమైనప్పటికీ దేశంలో నైపుణ్యం కలిగిన వారంతా ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
భారత్ నుంచి అమెరికా వెళ్లి ఏడాదికి 120,000 డాలర్లకుపైగా సంపాదిస్తున్న వారంతా ఇప్పుడు కొత్తగా ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలబడకపోతే తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ పరిణామాలన్నీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఇప్పటికే ఐటీ రంగంలో దూసుకుపోతున్నది.
మరోవైపు ఏపీలోని విశాఖపట్నం ఐటీ పెట్టుబ డులను ఆకర్షిస్తున్నది. ఐటీ హబ్‌గా అవతరిస్తున్నది. కానీ, ఇలాంటి తరుణాన్ని సమర్థంగా ఉపయోగించే దార్శనికత ఎవరికి ఉంది? నిజమైన గేమ్‌చేంజర్స్ ఎవరు కాగలరు? అందుకు సమాధానం.. తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీమంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేశ్.
ముగ్గురి సమర్థతపై విశ్వాసం..
శ్రీధర్‌బాబు, కేటీఆర్, నారా లోకేశ్ యుద్ధప్రాతిపదికన రాజకీయపరమైన విభేదాలు, ప్రాంతీయ వివాదాలను పక్కన పెట్టి ఒక్కటై ఉమ్మడి లక్ష్యం కోసం పని చేస్తూ, గ్లోబల్ నెట్‌వర్క్‌లు, డీప్ సెక్టార్ పరిజ్ఞానంతో రెండు రాష్ట్రాలకు భారీగా పె ట్టుబడులు తీసుకువచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ గ్లోబెల్ టెక్ కెప్టెన్సీ, లోకేశ్ స్టార్టప్ ఎకో సిస్టమ్, శ్రీధర్‌బాబు పాలసీ విధానం.. రెం డు రాష్ట్రాలకు వరంగా మారతాయని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్, విశా ఖపట్నం నగరాలు ప్రస్తుతం అన్ని విధాలుగా టెకీలకు అనుకూలంగా ఉంది.
ఈ ము గ్గురూ యుద్ధప్రాతిపదికన పూనుకుని విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి కోసం రెండు చోట్ల ప్రత్యామ్నాయ వేదికలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే గూగుల్ బోర్డ్ రూం నుంచి వాషింగ్టన్ లాబీల వరకు వెళ్లి తెలుగు రాష్ట్రాలను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారు. వ చ్చే నెలలో ప్రారంభం కానున్న వర్చువల్ సమ్మిట్‌లో లింక్‌డ్ ఇన్, ఎక్స్ ద్వారా 10 వేలమంది టెకీలను ఆకర్షించగలగాలని, త ద్వారా భారత్‌ను స్వయం సమృద్ధ శక్తిగా మార్చాలని ఆశిస్తున్నారు.
అంచనా
మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయవేత్త. సున్నితమైన భావోద్వేగాలు గల కుటుంబం నుంచి వచ్చిన నేత. హెచ్ 1బీ వీసాల దరఖాస్తు రుసము పెంపు ప్రభావంతో స్వదేశానికి తిరిగొచ్చే వారిలో 70శాతం మందిని ఆయన డీల్ చేయగలరు. ఆయా కుటుంబాలు, వారికి పిల్లలకు ప్రత్యేకమైన ప్యాకేజీలు కల్పించాలి. ఇక్కడ నిలదొక్కునేంత వరకు అండగా నిలవాలి. ప్రభుత్వ రాయితీలతో ఫ్యామిలీ ఫ్యూజన్ వీసాలు ఏర్పాటు చేయాలి. అలాగే మంత్రి లోకేశ్ ఏపీలో స్మార్ట్ విలేజ్ పేరిట రూరల్ హబ్స్ పేరిట తిరిగి వచ్చిన కుటుంబాలకు ఆవాసం కల్పిస్తారు. శ్రీధర్‌బాబు తెలంగాణలో ‘హైదరాబాద్ హెరిటేజ్ హోమ్స్’ పేరిట ఎన్‌ఆర్‌ఐలకు 30శాతం రాయితీలపై విలాసవంతమైన ఆవాసాలు కల్పిస్తారు. కేటీఆర్ ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు అడగా నిలుస్తూ, తెలుగు వారి, స్థానిక సాంస్కృతిక భావనను కలిగిస్తారు. సుహృత్ వాతావారణాన్ని చేరువ చేస్తారు. ఈ విధానాలన్నీ ఎన్‌ఆర్‌ఐలను ఆకట్టుకుంటాయి.
అంచనా 2
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు పరిశోధన, అభివృద్ధి దిగుమతులను వేగంగా గుర్తించి, వాటిని ఫార్మా రంగాన్ని బలోపేతం చేయవచ్చు. మరోవైపు గ్లోబల్ లీడర్‌గా కేటీఆర్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ దార్శనిక తతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వపరంగా ధైర్యంగా జీరో పన్ను విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగానే లోకేశ్ అమరావతికి వచ్చే స్పెషల్ ఎకనమిక్ జోన్ల(సెజ్)కు, తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చే టెక్ సంస్థలకు ఐదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయించాలి. అప్పుడు ‘రెమిటెన్స్ రిబేట్’ ద్వారా కంపెనీలకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో 50శాతం నిధులు సమకూరుస్తుంది. ఇలా యూఎస్ నుంచి తిరిగి వచ్చిన 10శాతం మంది నుంచి 6 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు. లోకేశ్ దీనిని పోలవరం మెగా ప్రాజెక్టు, పర్యావరణ హిత గ్రీన్ టెక్ వెంచర్స్‌కు కేటాయించవచ్చు.
అంచనా 3
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ‘ఇన్నోవేషన్ యాక్సిలరేటర్స్’కు సారథ్యం వహిస్తారు. ఏఐ రిగ్స్, త్రీడీ ప్రింటర్లు, క్వాంటం యాక్సెస్‌కు సంబంధించిన రిటర్నీ ల్యాబ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుడతారు. రెండేళ్ల పాటు ఉచిత యాక్సెస్‌కు అవకాశం ఇస్తారు. బయోటెక్ బేస్ కలిగి ఉన్న కాలిఫోర్నియా ఏవియేటర్స్‌కు వెసులుబాటు కల్పించాలి. ఈక్విటీ ఫర్ ఎక్స్‌పర్టుజ్’ గ్రాంట్లలో భాగంగా స్థానికులకు కొలువులు ఇచ్చే సంస్థల్లో 5శాతం ఈక్విటీకి 5,00,000 డాలర్లు అం దించాలి. తద్వారా వందలాది ఉద్యోగాలకు ఆస్కారం కలుగుతుంది. శ్రీధర్‌బాబు స్విగ్గీ వంటి స్టార్టప్‌లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి. కేటీఆర్ తరహాలో ఐటీ కంపెనీల నుంచి ఆహ్వానించాలి. 2027 నాటికి కనీసం 1,000 స్టార్టప్‌లు ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేయాలి.
అంచనా 4
లోకేశ్, శ్రీధర్‌బాబు, కేటీఆర్ త్రయం తలుచుకుంటే గుంటూరు సైబర్ సెక్యూరిటీ నెట్‌వర్క్ నుంచి వరంగల్ ఈవీ బ్యాటరీ ప్యాక్టరీల వరకు, నాస్కామ్‌తో కలిసి ‘గ్యారెంటీడ్ గిగ్ పాత్‌వేస్’కు మార్గం సుగమం చేయవచ్చు. తద్వారా 2030 నాటికి విదేశాల నుంచి తిరిగొచ్చిన 50,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. లోకేశ్ ఏపీ ఇంటిగ్రేషన్ సిస్టమ్‌ను, శ్రీధర్‌బాబు డేటా ఫైర్‌వాల్ భద్రతను పర్యవేక్షిస్తారు. కేటీఆర్ ప్రపంచ వేదికలకు నాయకత్వం వహిస్తారు. మెక్‌కిన్సే అధ్యయనం ప్రకారం.. విదేశాల నుంచి తిరిగి వచ్చే వారి సంఖ్య గతంలో కంటే 3 రెట్లు ఉంటుంది.
ఈ ప్రభావంతో భారత్ జీడీపీ 7శాతం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ‘ఎక్స్’ ద్వారా ‘రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజల రేపటి భవిష్యత్తు కోసం ఒక్కటిగా ఉంటాయి’ అని ప్రకటించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘మీరు విదేశాల్లో కలలు కన్న భవిష్యత్తును ఇక్కడ నిజం చేసుకోండి. మీ కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో భారత్ గ్లోబల్ జీడీపీ 25శాతం జీడీపీ ఉండగా, అమెరికా జీడీపీ కేవలం 3.5 శాతం ఉండేది. కానీ, ప్రస్తుతం అవన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు అమెరికా గ్లోబల్ జీడీపీ 30శాతం ఉండగా, భారత్‌ది 4శాతం ఉంది. లోకేశ్, శ్రీధర్, కేటీఆర్ కలిస్తే మరోసారి అద్భుతం జరగవచ్చు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పురోగమించవచ్చు