బదిలీల ప్రక్రియ గడువు పొడిగింపు
31 వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో 10 రోజులు పొడిగిస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల ప్రక్రియ గడువు ఈనెల 20వ తేదీతో ముగియడం, కొన్ని శాఖల్లో ఈ ప్రక్రియ గందరగోళంగా మారడంతో గడువును పొడిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20లోపు బదిలీలు పూర్తయ్యేలా రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈనెల 3న సర్కారు జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. 16 రోజుల్లో బదిలీలు పూర్తయ్యేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించి ప్రక్రియను చేపట్టింది. అయితే పలు శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ఈనెల 31 వరకు బదిలీల షెడ్యూల్ పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.






