13-10-2025 07:24:46 PM
ఎస్ఎస్ మహాదేవయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి..
ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ పుల్లారావు..
గరిడేపల్లి (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఉద్యమించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ట్రేడ్ యూనియన్ నాయకులపై కక్ష సాధింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు మానుకోవాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు చలిగంటి పుల్లారావు(పుల్లయ్య) అన్నారు. గ్రామీణ తపాల ఉద్యోగుల ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ జనరల్ సెక్రెటరీ ఎస్ఎస్ మహదేవయ్యను ఈనెల 3న కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విధుల నుంచి తొలగించడంతో దీనికి నిరసనగా ఏఐజీడిఎస్యు కేంద్ర నాయకుల పిలుపుమేరకు, సూర్యాపేట ఏఐజీడిఎస్యు డివిజన్ కార్యదర్శి జి.నాగరాజు ఆదేశానుసారం స్థానిక గ్రామీణ తపాలా ఉద్యోగులతో కలిసి ఉప తపాల కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ తపాల ఉద్యోగుల కమలేష్ చంద్ర కమిటీ లోని సానుకూల, న్యాయమైన సమస్యలపై 2023 డిసెంబర్ 12 నుండి 15 వరకు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆనాడు సుమారు 2000 మంది గ్రామీణ తపాల ఉద్యోగులను టెర్మినేట్ చేస్తే వారిని విధుల్లోకి తీసుకునే వరకు కేంద్ర ప్రభుత్వంతో, అధికారులతో పోరాటం నిర్వహించిన నాయకుడు మహాదేవయ్య అని అన్నారు. ఆ నిరవదిక సమ్మెను దృష్టిలో పెట్టుకొని సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఎస్ఎస్ మహాదేవయ్యపై కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈనెల 3న తనను విధుల్లోంచి తొలగించడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆయనను విధుల నుండి తొలగిస్తే గ్రామీణ తపాల ఉద్యోగులను పట్టించుకునే వారే ఉండాలని రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఈ చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు.
వెంటనే ఎస్ఎస్ మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యచరణలో భాగంగా ఈనెల 15న సూర్యాపేట డివిజన్ కార్యాలయం ఎదుట, ఈనెల 22న సర్కిల్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాలకు గ్రామీణ తపాల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు పెండెం తిరుపతయ్య, షేక్ మహబూబ్ బాషా, ధారావత్ శీను నాయక్, ప్రవీణ్, జీవన్ వనజ, శిరీషా తదితరులు పాల్గొన్నారు.