calender_icon.png 19 October, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్త నడకన బుగులోని జాతర పనులు..

19-10-2025 06:04:00 PM

పూర్తి కానీ రోడ్లు, మెట్ల మార్గం..

జాతరకు మిగిలింది పది రోజులే..

రేగొండ (విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర పనులు నత్త నడకన సాగుతున్నాయి. ప్రతి యేటా నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి 5 రోజుల పాటు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాక పలు జిల్లాల నుండి భక్తులు స్వామి వారి దర్శనానికి లక్షలాది మంది తరలి వస్తారు. ఈ జాతరకు భక్తుల సౌకర్యార్థం ప్రతి యేటా పాలకులు, అధికారులు జాతర ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఈ యేడు ఎక్కడి పనులు అక్కడే నిలిచి జాతర ప్రాంగణం అంతా దుర్భేద్యంగా తయారైంది. దీంతో స్థానికులు, గ్రామ ప్రజలు జాతరకు పనులు పూర్తి జరిగేనా అంటూ ఆందోళన చెందుతున్నారు.

ఎక్కడి పనులు అక్కడే..

ఈ యేడు జాతర బ్రహ్మోత్సవాలు వచ్చే నెల నవంబర్ 3 నుండి 7వ తేది వరకు జరగనున్నాయి. దీంతో జాతరకు ఇంకా 10 రోజులే మిగిలి ఉంది. జాతరకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, టాటా ఏస్ లు, ట్రాక్టర్ లు, ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కాలి నడక ఇలా పలు మార్గాల ద్వారా బయలుదేరి జాతరకు చేరుకుంటారు. జాతరకు రహదారులు రేగొండ వయా తిరుమలగిరి నుండి జాతరకు, జగ్గయ్యపేట నుండి జాతరకు, ఇటు వెంకటేశ్వర్ల పల్లి నుండి జాతరకు, జూబ్లీ నగర్, పాండవుల గుట్ట వయా బుగులోని జాతరకు ఇలా అనేక రహదారుల నుండి జాతరకు భక్తులు చేరుకుంటారు.

ఈ మార్గాలకు ప్రతి సంవత్సరం భక్తుల సౌకర్యార్థం రోడ్ల మరమ్మత్తులు, బుష్ కటింగ్, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేపడతారు. అలాగే జాతర ప్రాంగణంలోనే శ్రీ సమ్మక్క సారక్క దేవస్థాన ప్రాంగణం ఉంది. దీంతో ఆ దేవస్థాన ప్రాంగణాన్ని ఆర్టీసీ బస్సులు, హెవి వెహికల్స్ నిలపడానికి బస్టాండ్ గా వాడతారు.పోలీస్ చెక్ పోస్టు కూడా అక్కడే ఉంటుంది.కానీ ఇప్పుడు ఆ ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. అటు అధికారులు, ఇటు స్థానిక పాలకవర్గం శ్రద్ధ చూపెట్టక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి.

జాతరపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ,రూ.7 కోట్లతో పలు అభివృద్ధి పనులు..

శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక శ్రద్ధ చూపించి గతంలో ఏ నాయకుడు చేయనంత సుమారు రూ.7 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.జాతరకు పలు గ్రామాల నుండి బీటీ రోడ్లు,కొండ పైకి మెట్ల మార్గం,కోనేరు మరమ్మత్తు,మంచి నీటి బావికి ఓడ నిర్మాణం,మహిళలకు స్నానపు గదులు,మరుగుదొడ్లు, కళ్యాణ మండపం, కళ్యాణకట్ట తదితర పనులకు శంకుస్థాపనలు చేసి అధికారులు, గుత్తేదారులకు, స్థానిక నాయకులకు ఈ జాతరకు అన్ని పనులు పూర్తిచేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా పనులు పూర్తి చేయాలని వారిని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డిలతో కలిసి పలుసార్లు సందర్శించి పనులపై ఆరా తీశారు.ఎమ్మెల్యే ఎంత చెప్పినా అధికారులు, గుత్తే దారులు,స్థానిక నాయకుల్లో చలనం లేకుండా పోయింది.మెట్ల మార్గం ఇంకా పూర్తి కాలేదు.రోడ్ల నిర్మాణం, మెట్ల మార్గం, మంచినీటి బావి పనులు ఇంకా పూర్తి కాలేదు.మహిళలకు ఏర్పాటు చేసే స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఇంకా మొదలుపెట్టలేదు.జాతరలో విద్యుత్ దీపాలు అమర్చేలేదు.పాండవుల గుట్ట నుండి బుగులోని జాతర వరకు వచ్చే రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులు లభించకపోవడంతో ఎమ్మెల్యే ఆ రోడ్డుపై మొరంతో చదును చేసి గుంతలను పూడ్చాలంటూ ఎమ్మెల్యే ఆదేశించిన ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.ఇప్పటికైనా అధికారులు, స్థానిక నాయకులు స్పందించి జాతర పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.