ఫేక్ కాలేజీలను రద్దు చేయాలి
- బోర్డు నుంచి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు
- అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకోవాలి
- ఏబీవీపీ నాయకుల డిమాండ్
- ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి, అరెస్టు
ముషీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతి కోసం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు దొడ్డి దారిన ఫేక్ ఎన్‌ఓసీలు సమర్పించాయని, ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వి తేజ మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు బోర్డ్ అనుమతి కోసం ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించాలని కోరారు.
నగరంలో అనేక కళాశాలలో ఎటువంటి ఫైర్ సేఫ్టీ, ప్లే గ్రౌండ్ లేని శిథిలావస్థలో ఉన్న భవనాలలో నడుపుతున్నారని తెలిపారు. బోర్డు నుంచి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడు తున్నారని విమర్శించారు. ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేసి, భారీ జరిమానాలు విధించాలని, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో పటిష్టమైన తనిఖీలు చేపట్టి అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ కార్యకర్తలే అక్రమాలకు పాల్పడిన కళాశాలల భరతం పడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్, కోటి జిల్లా కన్వీనర్ రేవంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్, నగర కార్యదర్శి సురేందర్, రిషింద్ర, మణిదీప్, రాహుల్, సచిన్, సాయికిరణ్, విష్ణు, శివ, జశ్వంత్, రఘునందన్, రాంప్రసాద్, రాహుల్, శివ ప్రసాద్, పి. శివ, కురుమూర్తి పాల్గొన్నారు.






