20-06-2024 12:05:00 AM
ప్రముఖ బాలీవుడ్ గాయని అల్కా యాగ్నిక్ ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. “గత కొంత కాలంగా నేను కనిపించటం లేదంటూ అందరూ మెస్సేజ్‌లు చేస్తున్నారు. వాళ్ల కోసం ఈ పోస్ట్ పెడుతున్నా. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుండగా ఉన్నట్టుండీ నాకేమీ వినిపించలేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే ‘న్యూరల్ హియరింగ్ లాస్’ అనే వ్యాధి వచ్చినట్టు చెప్పారు. ఇయర్ ఫోన్స్ కారణంగా నా చెవులకు వైరల్ అటాక్ అయినట్టు తెలిపారు.
ఇది నా జీవితంలో పెద్ద ఎదురు దెబ్బ” అని వివరించిన అల్కా ‘దయచేసి నా కోసం మీరంతా ప్రార్థించండి’ అని కోరారు. ఇంకా ‘మీ మద్దతు, ప్రేమతో త్వరలోనే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతు నాకెంతో అవసరం’ అని అభిప్రాయపడ్డారు. అలాగే తన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ సలహా కూడా ఇచ్చారామె. ‘నా అభిమానులకు, సహచరులకు ఒక్కటే చెప్తున్నా.. పెద్ద శబ్దంతో సంగీతం వినడం మంచిది కాదు. ఇయర్ ఫోన్స్‌ను జాగ్రత్తగా ఉపయోగించండి’ అని ముగించారు అల్కా యాగ్నిక్.
అల్కా యాగ్నిక్ బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారామె. ఇప్పటి వరకు 25 భాషల్లో 20 వేల పైచిలుకు పాటలు పాడిన అల్కా ఏడు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనీమణిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. రెండు జాతీయ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. బాలీవుడ్‌లో మహిళా విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన జాబితాలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే తర్వాతి మూడో స్థానం యాగ్నిక్‌దే. 2002లో వచ్చిన ‘మనసుతో’ చిత్రంలోని ‘చిన్ని మనసే గాలిపటమై..’ పాట ఆమె పాడిందే. అలా తెలుగు ప్రేక్షకులను పలకరించిన యాగ్నిక్ ఆ తర్వాత కూడా టాలీవుడ్‌లో కొన్ని పాటలు పాడటం విశేషం. 2022లో అల్కా పాడిన పాటలు ఏకంగా 15.3 బిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవటం చెప్పుకోదగ్గ విషయం.