calender_icon.png 15 January, 2026 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆబ్కారీ.. నీరుగారి!

18-11-2025 01:08:58 AM

సమస్యల వలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ

  1. సర్కార్ ఖజానాకు ప్రధాన వనరైనప్పటికీ శీతకన్ను 
  2. అద్దె భవనాల్లోనే రాష్ట్రంలోని 70% ఎక్సైజ్ స్టేషన్లు 
  3. క్షేత్రస్థాయిలో వేధిస్తున్న సిబ్బంది కొరత 
  4.   8 ఏళ్లుగా ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు పెండింగ్
  5. రాష్ట్రంలో మూడే ల్యాబ్‌లు.. అవికూడా అప్‌డేట్ కానివే
  6. శాఖను ప్రక్షాళన చేయాలని సిబ్బంది, ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేశాఖ ఎక్సుజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా శాఖను రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల అలసత్వం, నిర్లక్ష్యం ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారింది. శాఖ నుంచి లెక్కలేనంత ఆదాయం వస్తున్నప్పటికీ శాఖ పనితీరు, నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

డ్రగ్స్, నార్కోటిక్స్ నిర్మూలన వంటి కీలక విధులుండేశాఖను సిబ్బంది కొరత వేధిస్తున్నది. ల్యాబ్‌ల్లో సుశిక్షితులైన టెక్నీషియన్లు లేక కేసుల పరిష్కారం ఆలస్య మవుతున్నది. 2017 నుంచి ఇప్పటివరకు సాధారణ బదిలీలు లేకపోవడం, 70 శాతం స్టేషన్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండటం విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వశాఖలోనైనా రెండేళ్లకోసారి బదిలీల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, ఎక్సైజ్‌శాఖ మాత్రం ఎనిమిదేళ్ల నుంచి బదిలీల గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.

ఉద్యోగోన్నతుల్లేవ్

ప్రభుత్వశాఖల్లో ఎంత చిన్నశాఖలోనైనా బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఎక్సుజ్ శాఖలో 2017 నుంచి ఎస్సు నుంచి ఆపై క్యాడర్లకు ఇప్పటివరకు సాధారణ బదిలీలు జరగలేదు. ఎనిమిది సంవత్సరాలుగా బదిలీల ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. దీంతో ఎంతోమంది ఉద్యోగులు, అధికారులు ఒకేచోట తిష్ఠ వేసుకుని కూర్చున్నారు. ఈ పరిస్థితి అధికార వికేంద్రీకరణ, పాలనా పారదర్శకతకు ఆటంకం కలిగిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల ముందు తూతూమంత్రంగా కొన్ని బదిలీలు చేసినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో జరగకపోవడం గమనార్హం. ఇప్పటికీ సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతులు విషయం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎక్సైజ్‌శాఖ 2014 నుంచి ప్యానల్ ఇయర్‌ను రూపొందించకపోవ డం, సీనియారిటీ జాబితాను సిద్ధం చేయకపోవడం వల్ల ఉద్యోగులు సుదీర్ఘకాలం నుంచి ఒకే పోస్టింగ్‌లో ఎదుగూబొదుగూ లేకుండా ఉంటున్నారు.

పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైల్‌పై సంతకం సైతం చేశారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ దస్త్రం వెలుగు చూడలేదు. దానిపై ఎలాం టి కసరత్తు లేకపోవడంపై ఉద్యోగులు విస్మయం వక్త్యం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎక్సుజ్ శాఖను పునర్వ్యవస్థీకరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరలేదు. 

అద్దె భవనాల్లోనే 70 శాతం స్టేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖకు 139 స్టేషన్లు ఉండగా వీటిలో 70శాతం వరకు స్టేషష్లు అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కొత్తగా నిర్మించాల్సిన 14 స్టేషన్ల సంగతి కూడా ఎటూ తేలడం లేదు. సొంత భవనాల గురించి ఉన్నతాధికారుల ప్రశ్నిస్తే దశాబ్దాల నుంచీ‘ప్రభుత్వం సొంత భవనాలకు నిధులివ్వడం లేదు’ అని చెప్తుండటం గమనార్హం.

అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య సిబ్బంది పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 ఎక్సుజ్ శాఖ చెక్‌పోస్టుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. ఆ చెక్‌పోస్టుల్లో వారికి మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల గుడారాలు వేసుకు ని, మరికొన్ని చోట్ల కంటెయినర్లను కార్యాలయాలుగా మార్చుకుని విధులు నిర్వహిం చాల్సిన దుస్థితి నెలకొంది.

అప్‌డేట్ కాని ల్యాబ్‌లు

డగ్స్, నార్కోటిక్స్, నకిలీ మద్యానికి సంబంధించి కేసులను ఎక్సైజ్‌శాఖ సత్వరం పరిష్కరించాలంటే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ల్యాబ్‌లు ఉండాలి. కానీ, ఆ శాఖకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడంటే మూడే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా అప్‌డేట్ అయినవి, అత్యాధునిక యంత్రపరికరాలతో ఉన్నవి కాకపోవడంతో కేసుల పరిష్కారం మరింత ఆలస్యమవుతున్నది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాబ్‌లు ద్వారా కేవలం గుడుంబా కేసులకు సరిపోతాయని, గంజాయి, మెఫెడ్రోన్, హాషిష్ ఆయిల్, ఎండీఎంఏ, కొకైన్, ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్ వంటి పరీక్షలకు పెద్దగా ఉపయోగపడవని సొంతశాఖ సిబ్బందే వాపోతుండటం గమనార్హం. అలాగే ఆయా ల్యాబ్‌ల్లో సుశిక్షితులైన సిబ్బంది లేరనేది వాస్తవం.

దీంతో ఎక్సైజ్‌శాఖ ముఖ్యమైన కేసులు ఉన్నప్పుడు పోలీస్ శాఖకు చెందిన ఫోరెన్సిక్ సైల్స్ ల్యాబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)పైనా ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి ఎక్సుజ్ శాఖపై దృష్టి సారించాలని  ఆశాఖ సిబ్బంది కోరుతున్నారు. ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని, ప్రతిచోట సొంత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.