18-11-2025 08:13:32 AM
బినాబీ పేర్లతో లిక్కర్ 'సిండికేట్' లో ప్రభుత్వ ఉద్యోగులు.
సిండికేట్ అగ్రిమెంట్ లో సాక్షులుగా ప్రభుత్వ ఉద్యోగులు.
మద్యం సిండికేట్ లో ఉద్యోగుల పాత్రపై అధికారుల ఆరా.!
ప్రజావాణిలో లిక్కర్ సిండికేట్ వ్యవహారంపై ఫిర్యాదు.
సిద్దిపేట,(విజయక్రాంతి): సమాజ దిక్సూచకులుగా నిలువాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు(Government teachers) మద్యం వ్యాపారంలో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బోర్ కొట్టిన వారు మద్యం వ్యాపారంలో అరితెరిపోతున్నారు. దుబ్బాక మద్యం సిండికేట్ వ్యవహారం ప్రజావాణిలోకి చేరింది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో లిక్కర్ వ్యాపారం( liquor traders) బయటకు వచ్చింది. దుబ్బాక లోని రేణుక ఎల్లమ్మ, బాలాజీ, మణికంఠ, లక్కీ వైన్స్ యజమానులు కలిసి ఆగస్టు 2024లో సిండికేట్ గా ఏర్పాటు చేసుకుని అక్రమ దందాకు తెరదించారు. ఈ అక్రమ వ్యవహారం అప్పటినుంచి ఇప్పటివరకు మూడు పూలు ఆరుకాయలుగా సిండికేట్ వ్యవహారం నడుస్తుంది. ఈ లిక్కర్ సిండికేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా కనబడుతోంది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గతేడాది ఆగస్టులో ఏర్పాటు చేసుకున్న లిక్కర్ సిండికేట్ ఒప్పంద పత్రంలో సాక్షులుగా ప్రభుత్వ ఉద్యోగులైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల విద్యాధికారి బొమ్మగోని రమేశ్ గౌడ్, తొగుట మండలం చిన్న ముత్యం పేట ప్రాథమిక పాఠశాల టీచర్ గొడుగు సత్యనారాయణలు సంతకాలు పెట్టిన కాఫీని ప్రజావాణిలో సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటుగా ఆర్థిక లావాదేవీలు, క్రయవిక్రయాలు చేయొద్దనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ తమకు పట్టనట్టుగా సదరు ఉద్యోగులు వ్యవహరించి ఆర్థిక కార్యకలాపాలు జరిపారు. సదరు ఉద్యోగుల బ్యాంకు స్టేట్ మెంట్ పై విచారణ చేపడితే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.
రేణుకా ఎల్లమ్మ వైన్స్ ను 2023_ 2025 ఏడాది గాను మండల పరిధిలోని దుంపల పల్లి గ్రామానికి చెందిన దినేశ్ గౌడ్ కు లాటరీ ద్వారా వచ్చింది. దినేశ్ గౌడ్ నుండి కొమురవెల్లి ఎంఈఓ రమేశ్ గౌడ్ రూ. 67 లక్షలకు కొనుగోలు చేశాడు. చిన్న ముత్యం పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గొడుగు సత్యనారాయణ మణికంఠ వైన్స్ లో 10 శాతం షేర్ హోల్డర్ గా ఉన్నట్లు తెలిసింది. చిన్నారి పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన బడి పంతుళ్ల మద్యం దందా బయటకు రావడంపై ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
మండలంలో 134 బెల్ట్ షాపులు ఉన్నాయి. సిండికేట్ వైన్స్ ల నుంచి బెల్టు దుకాణాలకు సరఫరా అయ్యే క్వార్టర్ పై అదనంగా రూ.350 వసూలు చేస్తున్నారు. దుబ్బాక వైన్స్ లల్లో రోజుకు సుమారుగా రూ.15 లక్షల వరకు గిరాకీ నడుస్తోంది. లిక్కర్ సిండికేట్ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పొడుస్తున్న లిక్కర్ సిండికేట్ యాజమానులు, సిండికేట్ లో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే.