calender_icon.png 18 November, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్‌కు డెడ్‌లైన్

18-11-2025 01:05:53 AM

  1. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిందే
  2. చర్యలు మీరు తీసుకుంటారా? మమ్మల్ని తీసుకోమంటారా?: సుప్రీంకోర్టు
  3. ప్రక్రియ ప్రారంభించామన్న స్పీకర్ తరఫు అడ్వొకేట్
  4. మరికొంత సమయం కావాలని అభ్యర్థన 
  5. నాలుగు వారాల గడువిచ్చిన అత్యున్నత న్యాయస్థానం
  6. లేదంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని స్పష్టీకరణ

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన వారి అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసిం ది. అసెంబ్లీ స్పీకర్‌కు చివరి అవకాశం ఇచ్చింది. చర్యలకు మరో నాలుగు వారా ల గడువు ఇస్తున్నట్లు సోమవారం స్పష్టం చేసింది. ఈ గడువులోగా తుది నిర్ణయాన్ని ప్రకటించి తీరాలని ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.

లేదంటే కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. అనర్హత పిటిషన్లపై జూలై 31వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు ముగిసినప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టులో రెండు ధిక్కార ఉల్లంఘన పిటిషన్లను దాఖ లు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయని స్పీక ర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారి న ఆయా ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయా లని విజ్ఞప్తి చేసింది.

బీఆర్‌ఎస్ అభ్యంతరాలు..

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకా రం వారిపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ వ్యవహరించడం పట్ల బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై, రాజ్యాంగ నిబంధనలపై విశ్వాసం కోల్పోయేలా స్పీకర్ వ్యవహారం ఉందని ఆ పార్టీ భావించింది. బీఆర్‌ఎస్ పిటిషన్లు దాఖలు చేయడానికి ముందే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు.

కోర్టు ఆదేశాల ప్రకారమే తాను అనరత ప్రక్రియను ప్రారంభించానని తెలిపారు. అయితే, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సమగ్ర విచారణ, ఇరు పక్షాల వాదనలు, పత్రాల పరిశీలన వంటి అంశాలు పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమని కోర్టును అభ్యర్థించారు. తద్వారా పరోక్షంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం తనకు లేదని స్పీకర్ వెల్లడించారు. కానీ, ప్రక్రియ పూర్తవడానికి కాలయాపన జరుగుతోందని వివరించే ప్రయత్నం చేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం హెచ్చరించింది. ‘స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేం ముందే చెప్పాం.. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపు కోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి’ అని హెచ్చరించింది. దీంతో 4 వారాల్లోపు విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫు న్యాయ వాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు.

పరిగణలోకి స్పీకర్ అభ్యర్థన

ఇరుపక్షాల వాదనలు, బీఆర్‌ఎస్ లేవనెత్తిన తీవ్ర అభ్యంతరాలు, ను పరిగణనలోకి తీసుకుంది. విచారణ అనంతరం తుది ఆదేశాలను జారీ చేసింది. స్పీకర్‌కు ఇది చివరి అవకాశంగా పేర్కొంటూ, పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరో నాలుగు వారాల గడువును మంజూరు చేసింది. ఈ గడువులోగా తప్పనిసరిగా తుది నిర్ణయాన్ని ప్రకటించి తీరాలని స్పష్టం చేసింది. పిటిషన్లపై తదుపరి విచారణను కూడా నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఆ సమయానికి స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు ముందు ఉం చాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా గడువును తప్పించుకున్న స్పీకర్‌కు మళ్లీ గడువు ఇవ్వడంపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నా యి. ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని కాపాడటంలో స్పీకర్ పాత్ర అత్యంత కీలకం. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు స్పీకర్‌కు గడువులు ఇవ్వడం, అవి తప్పడం సర్వసాధారణంగా మారింది.

అయినప్పటికీ, ఈసారి ధర్మాసనం చివరి అవకాశం అనే పదాన్ని ఉపయోగించడం, నాలుగు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేయడం గమ నార్హం. మరి స్పీకర్ ఈసారి గడువును పాటిస్తారా? లేక మళ్లీ కొత్త అడ్డంకులు చూపిస్తారా? అనే అంశంపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.