23-08-2025 12:59:01 AM
- సీజన్ ముగిసి రెండు నెలలు దాటినా నిరీక్షణే
- 1041 మందికి చెల్లించాల్సింది రూ. 3.46 కోట్లు
మంచిర్యాల, ఆగస్టు 22 (విజయక్రాంతి): జిల్లాలో 2024-25 రబీ సీజన్‌లో 345 కొ నుగోలు కేంద్రాల నుంచి 1,97,590.920 (దొడ్డు 1,90,665.120, సన్న రకం 6,925.800) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 34,004 మంది రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. వీటికిగాను రైతుల అకౌంట్లలో 54,76,57,616 రూపాయలు జమ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ రూ. 500 ప్రకటించింది. కానీ ఈ సీజన్ గడిచినా బోనస్ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కాలేదు.
బోనస్ కోసం 1041 మంది ఎదురు చూపులు
రబీ సీజన్‌లో జిల్లాలోని 34,004 మం ది రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇందులో 1041 మంది రైతులు రబీలో కూడా సన్నా లు సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు కామన్ రకానికి రూ. 2,300, ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ. 2,320 మద్దతు ధర ప్రకటించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు ప్రభుత్వ మద్ధతు ధరతో పాటు రూ. 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి వానా కాలం సీజన్ లో అందజేసింది. కానీ రబీలో మాత్రం సీజన్ ముగిసి రెండు నెలలు దాటవస్తున్నా ఇంత వరకు దానీ ఊసే లేదు.
చెల్లించాల్సిన బోనస్ రూ. 3.46 కోట్లు
జిల్లాలో 1041 మంది రైతులు సన్నాలు సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 69,258 క్వింటాళ్ల సన్న ధాన్యం విక్రయించి వారికి రావాల్సిన 3,46,29,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు జిల్లాలోని నాలుగు ఏజన్సీల ద్వారా జరిపారు. రైతులు బోనస్ కోసం ఆయా ఏజెన్సీల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా ఎదురు చూస్తున్న
వడ్లు సొసైటీ సెంటర్‌లో అమ్మి రెండు నెలలు దా టింది. ఇంత వరకు బోనస్ డబ్బులు అకౌంట్‌లో పడటం లేదు. 12 ఎకరా లు కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తే మొదట్ల గాలి దుమారం, వర్షాల వల్ల పంట బాగా నష్ట పోయిన. దిగుబడి తగ్గింది. సన్నాలకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ అయినా వస్తే తొందగానే వస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుందనుకుంటే కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా మా గోసను చూసి బోనస్ (రూ. 1,28,400) డబ్బులు అకౌంటులో జమ చేయుండ్రి... పెట్టుబడికి కష్టమవుతుంది...
- ఇల్లెందుల శ్రీధర్ గౌడ్, పౌనూరు, జైపూర్