calender_icon.png 23 August, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ రైతును కదిలించినా కన్నీటి వేదనే

23-08-2025 12:57:20 AM

- వర్షాల కంటే వరదలే ముంచెత్తాయి

- నీట మునిగిన పంటలు

- ఇసుక మెటలతో పొలాలు

- ఆదుకునే నాధుడే కరువైయ్యారని కలత చెందుతున్న రైతులు

ఆదిలాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే అన్నదాతలకు విత్తనాలు.. ఎరువుల కొరతతో ఆది నుంచి కష్టాలే... దానికి తోడుగా ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. ఓసారి సకాలంలో వర్షాలు లేక పంటలు ఎందుతున్నాయనే ఆందోళన... మరోసారి భారీ వర్షంతో పంటలు నీట మునుగుతున్నాయనే ఆవేదన.

ఖరీఫ్ సాగు ఆరంభంలో నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత... అప్పోసోప్పో చేసి విత్తనాలు నాటితే వర్షాలు లేక నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదనే బెంగ. వర్షాలు సకాలంలో కురిసి పంట అంతా బాగుందనుకునే సమయంలో భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన పంటలతో పరేషాన్. మొత్తానికి ఎటు చూసినా చివరకు రైతన్నలకు కష్టాలు... కన్నీళ్లే  మిగులుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. నీట మునిగిన పంటపొలాలు కోలుకోలేని దెబ్బతీశాయి. 

నీట మునిగిన పంటలు.. ఇసుక మెటలలో పంట పొలాలు

ఇటీవల కురిసిన భారీ వర్షానికి సుమారు 20 నుండి 22 వేల ఎకరాల పంట నీట మునిగిందని ప్రాథమిక అంచనా. దీనికి తోడుగా వందల ఎకరాల పంట పొలాల్లో ఇసుక మెటలు వేశాయి. దీంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు పలు పంట పొలాలు కోతకు గురయ్యాయి. భారీ వరద నీటితో పంట పొలాలన్నీ చెరువులను తలపించడంతో పాటు బురదమయంగా మారాయి. 

వర్షాల కంటే వరదలతోనే అధిక నష్టం

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కంటే ప్రాజెక్టులు, నదుల నుండి వచ్చిన వరదల వల్లే పంట అధిక నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదితో పాటు సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన వరదల తోనే వేల ఎకరాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్ గంగా నది పరివాహక మండలాలైన భీంపూర్, జైనథ్, బేలా మండలాల్లోని పలు గ్రామాల్లోని పంట పొలాలు భారీ వర్షాల కంటే పెనుగంగా  వరద ఉధృతితో పంటలు ఎక్కువగా నీటమునిగాయి. ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి ఉధృతికి సైతం పంటలు నీటి పాలవుతున్నాయి. పెన్ గంగా నది పరివాహక ప్రాంతాలు, సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టు దిగువన ఉన్న పంట పొలాలు ప్రతి ఏటా కురిసే భారీ వర్షానికి కంటే, ప్రాజెక్టుల గేట్ల ఎత్తి విడుదల చేసిన వరద నీటితోనే ముంపుకు గురవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎంత టెక్నాలజీ వచ్చిన వరదలు ముంచెత్తుతున్నాయి

ప్రస్తుతం ఎంత టెక్నాలజీ వచ్చిన చివరకు వరదలు తమను ముంచెత్తుతూనే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రకృతి విపత్తులు ఒక కారణమైతే అధికారుల నిర్లక్ష్యం మరో కారణం అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించేలా టెక్నాలజీ పెరిగిన, ప్రాజెక్టులకు వచ్చే వరద ఉధృతిపై అంచనా వేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో తాము బలవుతున్నామని అపోతున్నారు.

ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగి ప్రమాద స్థాయి చేరినప్పుడు అన్ని గేట్లు ఎత్తే నీటిని దిగువకు వదిలే బదులు ముందస్తుగా కొన్ని గేట్లు ఎత్తి కొద్దికొద్దిగా నీటిని దిగువకు వదిలితే ప్రాజెక్టుకు దిగువన ఉండే పంట పొలాలు అంతగా దెబ్బతీయని రైతుల అభిప్రాయం. ఓవైపు భారీ వర్షం దానికి తోడు మరోవైపు ప్రాజెక్టుల నుండి ఒక్కసారిగా విడుదల అయ్యే వరద నీరు రెండు కలిపి తమ పంటలను నీట ముంచుతున్నాయని రైతులు వాపోతున్నారు. 

తమను ఆదుకోవాలని కన్నీరు పెడుతున్న రైతన్నలు

భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన పంట పొలాలతో తమను ఆదుకోవాలని రైతులు కన్నీరుమున్నీర్ అవుతున్నారు. వర్షాలతో పంట నష్టం జరిగి ఐదు రోజులు గడుస్తున్న సర్వే చేయడానికి అధికారులు, నష్టపోయిన పంటను చూసేందుకు ప్రజా ప్రతినిధులు ఎవరు రాలేదని సాంగిడి గ్రామానికి చెందిన లచ్చన్న అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.  తనకున్న మూడు ఎకరాల పొలములో వేసిన సొయా పంట పూర్తిగా నీట మునిగిందని కంట తడి పెట్టుకున్నాడు.

తమ పంటలకు ప్రతిసారి వరదలతోనే నష్టం

నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి పెన్‌గంగా పరివాహక జైనథ్ మండ లం కౌఠ గ్రామంలో భారీ వర్షాలు కురిసిన పంటకు అంతగా నష్టం జరగకపోయినా, పెన్‌గంగా నుంచి వచ్చే వరద ఉధృతికి తోడుగా సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన వరద నీటితోనే పంటలు మునిగిపోతున్నాయి. భారీ వర్షం ఎప్పుడు కురుస్తోందో తెలిసే టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ కు వరద నీరు చేరకముందే ప్రాజెక్టు నీటిమట్టాన్ని అంచనా వేసి నీటి విడుదల చేస్తే దిగువనున్న రైతులు ఇంతగా నష్టపోవాల్సిన పరిస్థితి రాదు.

 నర్సింగ్, రైతు, కౌఠ గ్రామం.