22-01-2026 02:41:37 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందనీ ఏవో సాయికిరణ్ తెలిపారు.మండలంలోని మాసానిపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్ కార్యక్రమంలో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుంది.రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరములను రైతు యొక్క ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈఫార్మర్ ఐడిని కేటాయించడం జరుగుతుంది.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏరకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు.కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుంది.పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధిపొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు ఆధార్, భూ యాజమాన్య పాస్ పుస్తకము ఆధార్కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మీసేవను సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఏవో సాయికిరణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ దివ్య, రైతులు సంగయ్య,సామెల్, దుర్గయ్య,శంకర్,శివ రాములు,పరువయ్య తదితరులు పాల్గొన్నారు.