22-01-2026 02:46:09 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును రాజస్థాన్ అధికారుల బృందం పరిశీలించి ప్రశంసించింది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఈ బృందం అధికారులు సందర్శించి అక్కడ చెత్త సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించడం, గ్రామస్తులు తడి పొడి చెత్తను వేరువేరుగా ఉంచి పారిశుద్ధ్య వాహనానికి అందించడం, సేకరించిన చెత్తతో ఎరువుల తయారీ విధానం తదితర అంశాలను ఈ బృందం అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను కలిశారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలను గురించి బృందం సభ్యులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో మల్టీపర్పస్ వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు అందజేస్తున్న రక్షణ కవచాలు, బీమా సౌకర్యం తదితర విషయాలను గురించి సభ్యులతో చర్చించారు. రాజస్థాన్ బృందం సభ్యుల్లో స్వచ్ఛభారత్ మిషన్ రాజస్థాన్ డైరెక్టర్ సాలోని కెంకా, గంగానగర్ జెడ్పీ సీఈవో గిరిధర్, బర్మార్ జెడ్పి సీఈవో రవికుమార్, ఎస్ బి ఎం బ్యాంక్ డైరెక్టర్ మురళి లాల్ శర్మ, ఈఈ రాజేష్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీధర్, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.