calender_icon.png 24 August, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమాకుల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు

24-08-2025 12:02:42 PM

నంగునూరు: రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి నిదర్శనంగా సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నిలుస్తున్నాయి. యూరియా కోసం పాలమాకుల గ్రామ రైతులు పడుతున్న పాట్లు హృదయ విదారకంగా ఉన్నాయి. సుమారు 800 మంది రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే యూరియా బస్తాల కోసం క్యూ లైన్‌లో నిలబడ్డారు. కానీ, అక్కడ అందుబాటులో ఉన్నది కేవలం 400 పైచిలుకు బస్తాలు మాత్రమే. సగం మందికి కూడా యూరియా దక్కని పరిస్థితి ఏర్పడింది.

గంటల తరబడి నిరీక్షించి, యూరియా దొరకదని తెలిసిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అంటూ రైతులు నినాదాలు చేశారు. "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఒకవైపు వ్యవసాయానికి కీలకమైన యూరియా అందుబాటులో లేక పంటల సాగుకు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రభుత్వం కొరత లేదని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు.ప్రభుత్వం సరైన ప్రణాళికతో యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, యూరియాను వెంటనే రైతులకు అందుబాటులోకి తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, తమ పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.