calender_icon.png 24 August, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెయు ఎడ్యుకేషన్ కాలేజీ అవకతవకలపై విచారణ

24-08-2025 12:48:39 PM

హన్మకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) ఎడ్యుకేషన్‌ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న పోరిక రమేష్‌ విధి నిర్వహణలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో విశ్వవిద్యాలయం నియమించిన విచారణ కమిటీ విచారణ చేసింది. ఈ తరుణంలోనే పోరిక రమేష్‌ పలు అవకతవకలకు పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే, మోడరేషన్ ప్రాసెస్ ఫీజుల వసూళ్లలో అక్రమాలు జరిపి, ఆ నిధులను అనుచితంగా వినియోగించారని ఆరోపణలు పోరిక రమేష్‌ పై ఉన్నాయి. అంతేకాకుండా అనుబంధ ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో దురుసుగా ప్రవర్తించారని, వాగ్దాడి చేశారని కమిటీ తెలిపింది.

ముఖ్యంగా విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను అక్రమంగా కేటాయించడం, ప్రైవేట్‌ కళాశాలల నుండి అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం వంటి అంశాలలో రమేష్‌ పాత్ర ఉందని కమిటీ తేల్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన వైస్‌ చాన్స్‌లర్‌ వెంటనే వివరణ కోరారు.వీసీ ఆదేశాల మేరకు పార్ట్ టైం లెక్చరర్ డా.పోరిక రమేష్ కు షోకాజ్ నోటీసు జారీ చేసారు. ఇక పోరిక రమేష్‌ మూడు పని రోజుల లోపు లిఖితపూర్వక సమాధానం సమర్పించాల్సి ఉంటుందని, ఆయన సమాధానం ఇవ్వని పక్షంలో లేదా సమాధానం తగినదిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు.