calender_icon.png 27 October, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

27-10-2025 07:45:22 PM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి..

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం..

నిజామాబాద్ (విజయక్రాంతి): తుఫాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సోమవారం సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.

తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.  కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎస్.ఐ.ఆర్ అమలు కోసం చేపడుతున్న కసరత్తు గురించి మండలాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను జాగ్రత్తగా సరిచూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్లకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. బీ ఎల్ ఓ సూపర్వైజర్లు ఒక్కో పోలింగ్ స్టేషన్ వారీగా బీ ఎల్ ఓలతో స్వీయ పర్యవేక్షణలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పకడ్బందీగా జరిపించాలని అన్నారు. నిర్దిష్ట గడువు లోపు దీనిని పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, బీ ఎల్ ఓ సూపర్వైజర్లు, బీ ఎల్ ఓ లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.