27-10-2025 07:47:57 PM
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..
నిజామాబాద్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రవాణా శాఖల అధికారులతో ధాన్యం, పత్తి కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు అవసరం మేరకు సమకూర్చాలని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తుపాను తీవ్రత అధికంగా ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుపాను తీవ్రత తగ్గే వరకు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేయడం జరుగుతుందని, ఈ యాప్ లో రైతులు కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయంతో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
వరి ధాన్యం, పత్తి రైతులు తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలని, తేమ శాతాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సరిహద్దు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని, బయట రాష్ట్రాల నుండి వచ్చే వరి ధాన్యం, సోయాబీన్, కందులు, పెసలు అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో అవసరం ఉన్న అన్ని ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా అందించడం జరుగుతుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం జరుగుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, సోయాబీన్ రైతుల సౌకర్యార్థం కూడా జిల్లాలో మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.