సాగునీటి అవసరాలకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, ఆగస్టు 18 : ఎల్ నినో నేపథ్యంలో రైతులు సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటి అవసరం గల ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండలం గొల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వ స్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులు వరి మినహా తక్కువ నీటి అవసరం ఉన్న ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. ప్రాజెక్టులోని నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. భీమారం మండల తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం ప్రతిపాదిత భూమి, మండలంలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న వి.ఓ. భవనం పనులను పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ విలువైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల పనులను పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంటశాలను పరిశీలించి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు.
10వ తరగతి విద్యార్థుల చదువు, పరీక్షల సన్నద్ధతపై సమీక్షించి, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి వంటశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే రీతిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని
ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారితో మాట్లాడి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై సూచనలు చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాలు, పంటల సాగుకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సదానందం, ఆర్.ఐ. రజిత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






